కోనసీమను గోదావరి ముంపు బాధలు వెంటాడుతున్నాయి. వారం దాటినా వరదలు శాంతించడం లేదు. మోకాళ్ల లోతు నీటితో ప్రజల కష్టాలను ఎదుర్కొంటున్నారు. వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగటంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద కారణంగా భారీగా పంటనష్టం చోటుచేసుకుంది.
మళ్లీ పెరిగిన వరద
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి మంగళవారం శాంతించినట్లు కనిపించినా... బుధవారం మళ్లీ ఉద్ధృతమైంది. ధవళేశ్వరం వద్ద లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నందున... దిగువ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భారీ మొత్తంలో జరిగిన పంట నష్టం.... రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి.
భారీగా పంట నష్టం
అమలాపురం డివిజన్ పరిధిలోని 12 మండలాలు, రామచంద్రాపురం డివిజన్‌లోని 2మండలాల్లో ముంపు పరిస్థితులు... ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తపేట, కాట్రేనికోన, ఐ.పోలవరం, రావులపాలెం, సఖినేటిపల్లి, మామిడికుదురు, తాళ్లరేవు, ముమ్మిడివరం, కె.గంగవరం మండలాల్లో రైతులకు తీరని వేదనే మిగిలింది. వేల రూపాయలు అప్పు చేసి పంటలు వేస్తే... మొత్తం తుడిచి పెట్టుకుపోయిందని వాపోతున్నారు
అస్తవ్యస్తంగా ప్రజల దుస్థితి
తూర్పుగోదావరి జిల్లాలో 12మండలాల పరిధిలోని 61గ్రామాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయలు, అరటి, బొప్పాయి, పూలు... ముంపు బారిన పడ్డాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి వడి కాస్త తగ్గినా... వరద ముంపు కొనసాగుతుండటం కోనసీమ వాసులను బెంబేలెత్తిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన జీవనం ఎప్పుడు గాడిన పడుతుందోనని ప్రజలు నిరీక్షిస్తున్నారు.
ఇదీచదవండి