వరదలొచ్చిన ప్రతిసారి తూర్పుగోదావరి జిల్లా లంకవాసుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వరదలతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. వరదల్లో ఉన్న తమను చూసేందుకు అధికారులు వచ్చి..నిత్యావసరాలు ఇస్తామంటారే గానీ...పరిష్కారం చూపించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలకు బదులు తమ గ్రామాలకు వంతెనలు నిర్మిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని లంక గ్రామస్తులు కోరుతున్నారు.
పి గన్నవరం నియోజకవర్గం బూరుగు లంక గ్రామాల్లోకి వశిష్ఠ గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు నాలుగు వేల మంది అవస్థలు పడుతున్నారు. నదిపై వంతెన నిర్మించాలని దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని ఇప్పటి ప్రభుత్వమైనా చేయాలని కోరుతున్నారు.
గతంలో వచ్చిన వరదలకే పంటలు నాశనమయ్యాయనీ, మళ్లీ ఇప్పుడు వచ్చిన వరదలకు పంటలు పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలు నిలబెట్టుకుందామనుకున్న తమకు గోదావరి కన్నీరే మిగిల్చిందని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు రైతులు వాపోతున్నారు. అప్పనపల్లి కాజ్వే వరదలో మునిగిపోవటంతో చుట్టుపక్కల లంక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం బాల బాలజీ ఆలయానికి అప్పనపల్లి గ్రామస్తులతో సహా చుట్టు పక్కల వారు అధికంగా వస్తుండటంతో అధికారులే ట్రాక్టర్లు ఏర్పాటు చేసి కాజ్‌వేలను దాటిస్తున్నారు.
ఇదీ చదవండి : పోటెత్తిన గోదావరి - వరదగుప్పెట్లో 16 మండలాలు