Kuchipudi Dancers Sampurna Bharat Yatra: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని శ్రీ రాధాకృష్ణ సంగీత నృత్య కళాక్షేత్రంలో పాతికేళ్లుగా వేల మంది చిన్నారులు నృత్యం, సంగీతం నేర్చుకున్నారు. వీరికి రాజమహేంద్రవరం, అనపర్తిల్లోనూ నృత్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. గోరుగంతు ఉమా జయశ్రీ, బ్రహ్మశ్రీ బదరీ నారాయణ దంపతులు ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు.
భారతీయ సనాతన సంప్రదాయాలను, సిద్ధాంతాలను, పురాణాలను నృత్య ప్రదర్శనల ద్వారా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కూచిపూడి నృత్య కళా వైభవాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారికి మరింతగా తెలియజెప్పేందుకు రాధాకృష్ణ కళాక్షేత్రం 'సంపూర్ణ భారత యాత్ర' పేరిట దేశమంతా కళాకారులతో పర్యటించింది. అంతా మహిళా కళాకారులే ఈ బృందంలో పర్యటించించడం విశేషం. గత ఆగస్ట్ 11న రాజమహేంద్రవరం నుంచి ప్రారంభమైన 'సంపూర్ణ భారత యాత్ర' 63 రోజులపాటు 23 రాష్ట్రాల్లోని 18 వేల కిలోమీటర్లు పర్యటించింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు దర్శించారు. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శృంగేరీ శారదా పీఠం కూడా ఉన్నాయి. వెళ్లిన ప్రతి ఆలయంలోనూ కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఆయా క్షేత్రాల విశిష్ఠత బట్టి రామపాదుకా పట్టాభిషేకం, హనుమాన్ చాలీసా, సూర్యాష్టకం, కాలభైరవాష్టకం, భామా కలాపం, గోదావరి హారతి, గంగా హారతి ఇలా వివిధ రకాల ప్రదర్శనలతో అబ్బుర పరిచారు. అలాగే ఆయా క్షేత్రాల ప్రాధాన్యం, విశిష్టతలు తెలుసుకున్నారు.
కళారంగంలో రాణిస్తున్న గోదావరి అమ్మాయి.. ఎన్నెన్నో అవార్డులు
గోరుగంతు ఉమా జయశ్రీ, బ్రహ్మశ్రీ బదరీ నారాయణ దంపతుల కుమార్తె లక్ష్మీ దీపిక కూచిపూడి నాట్యకళాకారిణి. ఈ కళాకారిని దేశ విదేశాల్లో ఇప్పటికే సుమారు 3 వేల ప్రదర్శనలు ఇచ్చారు. గతంలో నిరంతర నృత్య ప్రదర్శనలతో వివిధ రికార్డులతోపాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. తల్లిదండ్రులతోపాటు ఈ యువతి కూడా 'సంపూర్ణ భారత్ యాత్ర'కు నేతృత్వం వహించింది. సమున్నతమైన సాంస్కృతిక వైభవాన్ని కన్నులారా వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ యువ కళాకారులు చెబుతున్నారు.
"'సంపూర్ణ భారతయాత్ర' పేరిట 63 రోజులపాటు 23 రాష్ట్రాల్లోని దేశంలోని ప్రముఖ క్షేత్రాలు దర్శించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇది అసాధ్యం అని చాలామంది అన్నారు. కానీ మేము ఎలాగైనా 63 రోజుల్లో మా యాత్రను పూర్తి చేసిన తర్వాతే ఇంటికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాం. అనుకున్నట్లుగానే మేము దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలను సందర్శించి కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి 63 రోజుల్లో ఈ యాత్రను పూర్తి చేసాం." - లక్ష్మీ దీపిక, సంగీత నృత్య కళాకారిణి
ఆంధ్రులకే ప్రత్యేకమైన కూచిపూడి నృత్యం గొప్పతనం దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి మరింతగా తెలియజేయడం ఈ యాత్ర ప్రత్యేకత అని గోరుగంతు బదరీ నారాయణ దంపతులు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను స్వయంగా దర్శించడం ద్వారా భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల ఔన్యత్యం యువ కళాకారులకు అర్థమయిందని తెలిపారు. ఈ యాత్రలో వైష్ణోదేవి, బద్రీనాథ్, కేదార్ నాథ్, వారణాసి ఇలా దేశ వ్యాప్తంగా అన్ని క్షేత్రాలు సందర్శించడం అద్భుతమైన అనుభూతి అని చెబుతున్నారు.
"ఆంధ్రులకే ప్రత్యేకమైన కూచిపూడి నృత్యం గొప్పతనం దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి మరింతగా తెలియజేయడం కోసం మేము ఈ యాత్ర చేపట్టాం. యాత్రలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలను సందర్శించాం." - గోరుగంతు బదరీ నారాయణ దంపతులు
'సంపూర్ణ భారత్ యాత్ర'లో యువ కళాకారులతోపాటు వారి తల్లిదండ్రులు కొందరు వివిధ క్షేత్రాలు సందర్శించారు. ఈ యాత్ర తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని వారు చెబుతున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు, సందర్శనలకు ప్రత్యేక అనుమతులిచ్చారు. భవిష్యత్లో మరింతగా కూచిపూడి నృత్య ప్రదర్శనల ద్వారా కళా వైభవాన్ని చాటుతామని యువ కళాకారిణిలు చెబుతున్నారు.
అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్