కోరిన కోరికలు, అడిగిన వరాలు ఇచ్చే స్వామిగా పేరుగాంచిన కోనసీమ తిరుపతి... వాడపల్లి వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ ఉత్సవాలను స్వామివారి మేలుకొలుపు, నిత్యార్చన, నిత్యహోమం, నిత్య బలిహరణ, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
సోమవారం ఉదయం 7 గంటలకు స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించి భక్తులతో ముత్యాల తలంబ్రాలు వేయిస్తారు. కల్యాణ మహోత్సవంలో భాగంగా పొన్న వాహన సేవ, తెప్పోత్సవం, పూర్ణాహుతి, చక్రస్నానం, పుష్పోత్సవం నిర్వహిస్తారు. ఈ ఘట్టం అనంతరం స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.
రథోత్సవం చరిత్ర...
వాడపల్లి రథోత్సవానికి ఒక చరిత్ర ఉంది. 1931వ సంవత్సరంలో స్వామి తీర్థం రోజున రథోత్సవం జరుగుతున్నప్పుడు రథం మీద ఉన్న త్రివర్ణ పతాకం, గాంధీ చిత్ర పటాన్ని బ్రిటీష్ పాలకులు తొలగించారు. బ్రిటీష్ వారిని ఎదురించిన భక్తులు తుపాకీ తూటాలకు అసువులు బాశారు. అప్పటి నుంచి ఆగిపోయిన రథోత్సవం 2ఏళ్ల నుంచి తిరిగి ప్రారంభమైంది.
ఏడు శనివారాల శ్రీనివాసుడు...
ఏడు శనివారాలు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం అని భక్తులు నమ్మతారు. ఏడు శని వారాల నోము నోచుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి వారం సుమారు 50 వేల మంది ఈ ఆలయానికి వస్తుంటారు.