Karthika masam: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తజనులతో కోలాహలంగా మారాయి. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆలయాలకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అన్ని శైవక్షేత్రాల వద్ద భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు.
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు దీపాలు వెలిగించారు. స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భీమేశ్వర స్వామిని మంత్రి వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో వేకువ జాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది. దీపాలు వెలిగించి.. భక్తులు హరి, హరులను స్మరించారు. కాకినాలోని ఉషా రాజేశ్వరీ సమేత భానులింగేశ్వర స్వామి ఆలయం, బాల త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాలను అధిక సంఖ్యలో భక్తులు సదర్శించారు. బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో లక్ష పసుపుకొమ్ముల పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలం కోరంగి కురంగేశ్వర స్వామి ఆలయంలో.. ఐ.పోలవరం మండలం మురుమళ్ల భద్రకాళీ వీరేశ్వరస్వామి ఆలయంలో.. కాట్రేనికోన మండలం కుక్కుటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
Karthika masam: కార్తీక మాసం చివరి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. సజ్జాపురంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయం, పాలంగిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు . భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
Karthika masam: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా.. విశాఖ జిల్లాలో శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునే పుణ్య స్నానాలు ఆచరించి భక్తితో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. రోలుగుంట మండలం బుచంపేట, నిందుగొండ్ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బుచ్మం పేట మినీ కైలాస గిరి కొండ మీద శివ పార్వతుల విగ్రహాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: unreleased cets counseling: నాలుగు సెట్‌లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడో..?