ENDOSCOPY: ఎండోస్కోపీలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగిందని, కృత్రిమ మేధతో రోబోటిక్ విధానంలోనూ చికిత్సలు చేయగల స్థాయికి విస్తరించిందని.. సుప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) అధినేత డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్ వైద్యకళాశాలలో నిర్వహిస్తున్న ఐఏజీఈఎస్ 19వ నేషనల్ కాంగ్రెస్‌లో.. రెండోరోజైన శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స పద్ధతుల వరకు గ్యాస్ట్రోఎంటరాలజీ ఫిజీషియన్లు, సర్జన్లు కలసికట్టుగా పనిచేయడం వల్ల సూక్ష్మస్థాయి చికిత్సలు ఎక్కువమందికి అందుతాయన్నారు. గ్రామాల్లో స్క్రీనింగ్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామన్నారు.
నాలుగు రోజుల సదస్సుకు సుమారు 200 మంది వైద్యులు ఫ్యాకల్టీగా రావడం పెద్ద విశేషమని.. ఐఏజీఈఎస్ 2022 ప్రెసిడెంట్ డాక్టర్ సునీల్ డి.పోపట్ అన్నారు. ఐఏజీఈఎస్ వార్షిక కార్యక్రమాలను కార్యదర్శి డా.ఈశ్వరమూర్తి వివరించారు. భారతదేశపు ఎండోస్కోపీ పితామహుడిగా పేరున్న డాక్టర్ బి.కృష్ణారావు పేరిట నెలకొల్పిన అవార్డును డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అందుకున్నారు.
చెన్నైలోని తన నివాసం నుంచి డాక్టర్ కృష్ణారావు ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమాన్ని చూసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు సమీరనాయక్, గన్ని భాస్కరరావు, గోవింద్‌రాజు, తంగవెళ్ళి, ఈశ్వరమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: