huge delay in payment for grain purchases: పంట పండించడమే అన్నదాతకు శాపంగా మారుతోంది. పొలం కౌలుకు తీసుకుని దున్నించింది మొదలు.. ధాన్యం సొమ్ము చేతికి వచ్చే వరకూ ఆరేడు నెలల సమయం పడుతోంది. కోత కోసిన ధాన్యాన్ని మిల్లుకు తోలిన తర్వాత సొమ్ము ఖాతాలో జమయ్యేందుకు రెండు, మూడు నెలలు పడుతోంది. ఈలోగా సొమ్ము సర్దేందుకు రైతు పడే పాట్లు అన్నీఇన్నీ కాదు. పంట కోసిన వెంటనే ఇంటికొచ్చే కూలీలు, కోత యంత్రాల వారికి సమాధానం చెప్పలేక మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కోనసీమ పరిధిలో పంట విరామం ప్రకటించిన మండలాల రైతులకు ప్రభుత్వం హడావిడిగా నగదు చెల్లింపులు చేసింది. మరి మిగిలిన వారి పరిస్థితేంటని క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈనాడు-ఈటీవీ బృందం ఎదుట రైతులు ప్రశ్నలు లేవనెత్తారు.
ధాన్యం డబ్బు చేతికి వచ్చేసరికి రెండు, మూడు నెలలు పడుతుంటే, పంట కాలాలే మారిపోతుంటే.. సాగు చేసేదెలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని గతంలో ఉన్న ఉత్తర్వులను 21 రోజులకు పెంచడంపై మండిపడుతున్నారు. వరి కోతలు పూర్తి కాగానే రైతులు మిల్లర్లను సంప్రదిస్తున్నారు. అక్కడికి వెళ్లే వారిలో 90శాతం మందికి మద్దతు ధర దక్కదు. తేమ, ఇతర వ్యర్థాలు, విరుగుడు పేరుతో బస్తాకు 300 వరకు తగ్గిస్తున్న మిల్లర్లు.. వెంటనే ఆర్బీకేలో రైతుల పేర్లను నమోదు చేయించడం లేదు. తాము పౌర సరఫరాలశాఖకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీకి అనుగుణంగా రైతుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. దీనికి నెల నుంచి రెండు నెలలు పడుతోంది.
గతంలో సహకార సంఘాలు, పొదుపు సంఘాల ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని అమ్మేవారు. అప్పుడూ మిల్లులకు తీసుకెళ్లి అప్పగించేవారు. సరుకు దించుకున్న మిల్లరు.. వెంటనే కొంత మొత్తాన్ని సర్దుబాటు చేసి, మిగిలిన డబ్బులు తర్వాత ఇచ్చేవారు. ఆ సొమ్ములతో కూలీలకు చెల్లింపులు చేసుకునేవారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు రైతుభరోసా కేంద్రాలు, ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వచ్చాక రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమవుతోంది. ఇందుకు రెండు మూడు నెలల సమయం పడుతోంది.
రైతుభరోసా కేంద్రాల్లో ఎక్కడా నేరుగా రైతుల నుంచి కొనడం లేదని.. అంతా మిల్లర్ల ద్వారానే జరుగుతోందని అన్ని స్థాయిల అధికారులకు తెలిసినా ఆర్బీకేలో నమోదైందే తమకు లెక్కని చెబుతున్నారు. ధాన్యం అమ్మిన నాటి నుంచి సొమ్ము బ్యాంకు ఖాతాలో జమయ్యే రెండు నెలలకు వడ్డీ లెక్కేసుకుంటే ఎకరం పంటలో రెండు బస్తాలు దానికే సరిపోతోంది. ఈ కష్టాలన్నీ తొలగాలంటే మిల్లుకు చేరిన వారంలోపే ధాన్యం సొమ్ము ఖాతాల్లో జమయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. వరి నాట్లు, కోతలు ముమ్మరంగా సాగే సమయంలో ఉపాధి హామీ పనులతో కూలీల కొరత ఏర్పడుతోందని.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానిస్తే సమస్య తీరుతుందని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: