ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశా యాప్.. మహిళలకు గొప్ప వరమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన దిశా యాప్ అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మన రాష్ట్రంలో మహిళల రక్షణకు ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి దిశ యాప్ ప్రవేశపెట్టినట్టు చెప్పారు. అత్యాచార ఘటనలపై.. ఏడు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లో విచారణ చేపట్టి 21వ రోజున శిక్షపడేలా చట్టం పని చేస్తుందన్నారు.
మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడితే రెండు సంవత్సరాల శిక్ష విధిస్తారని, తిరిగి బయటకు వచ్చిన తర్వాత అదే తప్పు మరోసారి చేస్తే నాలుగు సంవత్సరాల శిక్ష పడుతుందని వివరించారు. మరొకసారి తప్పునకు 10 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దిశా యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.
మన రక్షణ మన బాధ్యతను మహిళలందరూ గుర్తించి దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో దిశ యాప్ అవగాహన సదస్సు ఏర్పాటుకు సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిని మంత్రి అభినందించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం నుంచి రామవరం గ్రామం వరకు 11 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణ పనులకు హోంమంత్రి మేకతోటి సుచరిత, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి:
COVID CASES: రాష్ట్రంలో కొత్తగా 2,050 కరోనా కేసులు, 18 మరణాలు