నివర్ తుపాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ్యలతో నిండి మురుగునీరు మ్యాన్ హోల్స్ నుంచి రోడ్లపైకి చేరింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలిగిస్తున్నారు. ప్రముఖ వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.
ఉప్పాడ తీరంలో సముద్ర కోత
తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని సముద్ర తీరప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడలోని ఓ ఆలయం రెండు నెలల కిందట సముద్రానికి వందమీటర్ల పైబడిన దూరంలో ఉండేది. ప్రస్తుతం ఆలయానికి అతిచేరువగా నీరు చేరాయి. నివర్ తుపాన్ ధాటికి కెరటాల తీవ్రత పెరుగుతోంది. తీరానికి సమీపంలో ఉన్న గ్రామాలు కోతకు గురవుతున్నాయి. ఇప్పటికే ఆలయానికి వెనకనున్న పది ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీరప్రాంత గ్రామాలన్నీ సముద్రంలో కలిసిపోవడం ఖాయం.