ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మన్యం, మెట్ట, కోనసీమలోనూ జోరువానలు కురిశాయి. వర్షాలతో సుమారు 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏలేరు జలాశయం పూర్తిగా నిండిపోయింది. రెండు రోజుల నుంచి సుమారు 15వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. దీనితో కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదనీరు చుట్టూ ముట్టేసింది. కిర్లంపూడి మండలంలో రాజుపాలెం, ముక్కోలు, కిర్లంపూడిలో రహదారులు, వంతెనల పైనుంచి వరదనీరు పొంగి పొర్లింది. రాజుపాలెంలో ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు.
గొల్లప్రోలు మండలంలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గొల్లప్రోలులోని ఎస్సీపేట, లక్ష్మీపురం ప్రాంతాలు నీట మునిగాయి. పిఠాపురం మండలంలోని గొర్రకండి కాల్వ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల గండ్లు పడటంతో పంట పొలాలు మునిగిపోయాయి. పిఠాపురం మండలంలో వందల ఎకరాల్లో పంట నీట మునగటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జనావాసాలతో పాటు పంట పొలాలు మునిగిపోవడం వల్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గండేపల్లి మండలం జెడ్.రాగంపేట వద్ద బావిచెట్టు చెరువు నిండిపోయి గ్రామాన్ని ముంచెత్తింది. పెద్దాపురం మండలం కాండ్రకోట, వడ్లమూరు, గుడివాడ తదితర గ్రామాల్లో ఏలేరు నుంచి విడుదలైన నీరు పంటపొలాలను ముంచేసింది.
ఏటా భారీ వర్షాలతో పాటు ఏలేరు జలాశయం నుంచి విడుదల చేసిన నీరు పంటపొలాలను ముంచెత్తడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టి వరదముంపు నివారించాలని కాలనీవాసులు, రైతులు వేడుకుంటున్నారు.
ఇదీచదవండి