తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి బ్యారేజ్ నీటి మట్టం 9.5 అడుగులకు చేరింది. అధికారులు బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి... 7.4 లక్షలు క్యూసెక్కుల పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువలకు 9,350 క్యూసెక్కులను వదులుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రంపచోడవరం నుంచి పండిరిమామిడి రహదారిలో సీతపల్లి వాగుపై వేసిన వంతెన గురువారం రాత్రి కొట్టుకుపోయింది. దీనివల్ల రంపచోడవరం మండలంలో పాటు మారేడుమిల్లి, వై.రామవరం మండలాలలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని దేవీపట్నం మండలంలో గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. తొయ్యేరు రహదారిపై ఉద్ధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. వందల ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ముంపు గ్రామాల వాసులకు అధికారుల సూచిస్తున్నారు. కరోనా భయంతో తరలి వెళ్లేందుకు ముంపు గ్రామాల వాసులు ఆసక్తి చూపట్లేదు. వరద ఉద్ధృతి నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇదీ చదవండి