రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా...
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన్యం, మెట్ట, కోనసీమలో వర్షం కురుస్తోంది. కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురంలో వర్షాలు కురుస్తున్నాయి. మన్యంలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పరిధిలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, జి.పెదపూడి లంక, అరిగెలవారిపేట, లంక గ్రామాలు వశిష్ఠ గోదావరి నదికి మధ్యలో ఉన్నాయి. గోదావరి వరదతో ఈ నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు మర పడవలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి 50 కోట్లతో రెండోసారి టెండర్లు పిలిచారు. అయితే టెండర్ ఖారారై, పనులు ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వీలైనంత త్వరగా వంతెన నిర్మించి, ప్రయాణ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కడప జిల్లా..
కడపలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం జలమయమైంది. కడప ఆర్టీసీ గ్యారేజ్ లోకి భారీగా వర్షం నీరు చేరడంతో కార్మికులు అవస్థలు పడ్డారు. గ్యారేజీ మొత్తం చెరువుని తలపించింది. వర్షం నీటిలో కార్మికులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. నగరంలోని ఆర్టీసీ కార్మికుల భవనాలు, భరత్ నగర్, వై జంక్షన్, రాజంపేట బైపాస్ రోడ్డు, అప్సర కూడలి, మృత్యుంజయ కుంట, భాగ్యనగర్ కాలనీ, గంజికుంట కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికి కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పలు కాలనీల్లోకి మీరు వెళ్లడంతో రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది.
కృష్ణా జిల్లా..
విజయవాడలో భారీగా వర్షం కురిసింది. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
ఇదీ చదవండి: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?