గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కోనసీమలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ జలాలను.. సముద్రంలోకి విడుదల చేస్తున్న క్రమంలో.. దిగువన ఉన్న కోనసీమలో లంక గ్రామాలు, పంటలు జలదిగ్బంధం అయ్యాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం, అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం మండలాల్లో అరటి, కంద, బొప్పాయి, మునగ తోటలు నీటిలో నానుతున్నాయి. వరదల వల్ల రూపాయి కూడా వచ్చేట్టు లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
ముమ్మిడివరం పరిధిలోని కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లో.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరక్క... వరదల కారణంగా విషసర్పాలతో ప్రమాదకరంగా మారిందని బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఇళ్లల్లోకి నీరు చేరగా... ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. కొందరు కమ్యూనిటీ భవనాల్లో, ఎత్తైన భవనాలపైనా ఉంటున్నారు. వరద ఎప్పటికి తగ్గుతుందో అని వేచి చూస్తున్నారు.
ఇదీ చదవండి: