Godavari: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ధవళేశ్వరం బ్యారేజికి 11.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగుతున్నాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి ఘాట్లను మూసేశారు.
* భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి బుధవారం సాయంత్రానికి కాస్త తగ్గింది. అర్ధరాత్రికి నిలకడగా మారి, గురువారం నుంచి తగ్గుముఖం పట్టే సూచనలున్నట్లు అధికారులు తెలిపారు.
* పోలవరం స్పిల్‌వే వద్ద బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 33.40 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 10.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది.
బలహీనపడనున్న తీవ్ర అల్పపీడనం: ఛత్తీస్‌గఢ్ దాని పరిసరాల్లోని తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. బుధవారం రాత్రికి అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా పేర్కొన్నారు.
కొనసాగుతున్న వరద భయం: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను మళ్లీ వరద చుట్టేసింది. రెండు రోజుల క్రితం మెల్లగా ప్రారంభమైన వరద తీవ్రరూపం దాల్చింది. చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాల్లో పలు గ్రామాలను వరద ముంచెత్తింది. చింతూరు మండలంలోని జాతీయ రహదారులు 30, 216లపై మూడు చోట్ల వరద కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. చింతూరు మండలంలోని ఏజీ కోడేరు, ముకునూరు, పెద సీతనపల్లి, చదలవాడ, కల్లేరు గ్రామపంచాయతీల పరిధిలోని సుమారు 40 గ్రామాలకు రాకపోకలు లేవు. నెల రోజుల వ్యవధిలో మళ్లీ వరద రావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: