తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి సామర్లకోట మీదుగా రాజమహేంద్రవరం వెళ్లే రహదారుల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కోనసీమలో రాజవరం - పొదలాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు, అమలాపురం - బొబ్బర్లంక రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. కొత్తపేట బోడిపాలెం వంతెన నుంచి ముక్తేశ్వరం వంతెన రహదారిలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలకు రకరకాల కారణాలు కనిపిస్తున్నా.. వాటిని సరిదిద్దే చర్యలు లేవు. వాహన తనిఖీలు సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడంలేదు.
రహదారి భద్రతపై దృష్టి..
జిల్లాలో ఈ ఏడాది రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించాం. యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. కీలక రహదారులపై నిఘా పెంచుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాం. పెట్రోలింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలు అరికట్టడంతో పాటు, నిబంధనల అతిక్రమణపైనా దృష్టి సారిస్తాం. - అద్నాన్ నాయీo అస్మి, జిల్లా ఎస్పీ
0.89% అధ్వాన రహదారులు
రహదారులు ప్రమాదాలకు ఆలవాలంగా మారాయి. అధ్వాన గతుకుల దారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మరుతోంది. జిల్ల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 4,285 కి.మీ. పొడవున రహదారులు ఉంటే 637.29 కి.మీ. పొడవున దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు 6,585 కి.మీ. పొడవున ఉంటే.. 1,500 కి.మీ. పొడవున దెబ్బతిన్నాయి.
0.63% ప్రయాణికుల తప్పిదాలు
కదులుతున్న వాహనం ఎక్కడం, దిగడం లాంటివీ, ఫుట్‌పాత్ ప్రయాణాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
0.35% వాహన పరిస్థితి కారణంగా...
జిల్లాలో తిరుగుతున్న ఇరుగు పొరుగు వాహనాలు అన్నిరకాలు కలిపి 11.50 లక్షలు ఉన్నాయి. వీటిలో 15 ఏళ్లు నిండి.. కాలం చెల్లిన వాహనాలతో కాలుష్యానికి సెగతోపాటు ప్రమాదాలకూ ఆస్కారం కలుగుతోంది. వాహన సామర్థ్య తనిఖీలు సమర్థంగా జరిగితే పరిస్థితి కొంతమేర కుదుటపడే అవకాశం ఉంది.
1.83% పాదచారుల పొరపాట్లతో..
ట్రాఫిక్ నిబంధనలపై చాలా మంది ప్రయాణికులు, పాదచారులకు అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. కాకినాడ స్మార్ట్‌సిటీలో రూ.కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో పాదచారుల, వాహనచోదకుల తప్పిదాలు ప్రమాదాలకు తావిస్తున్నాయి.
0.94% ఇతరత్రా కారణాలతో..
దూర ప్రయాణాల సమయంలో ప్రయాణాల్లో సరైన విశ్రాంతి, ఏకాగ్రత లేకపోవడం సమస్యగా మారుతోంది. జిల్లాలో జాతీయ రహదారిపై ‘ట్రక్కు లే బే’ కత్తిపూడిలో మినహా మరెక్కడా లేదు. దీంతో ఎక్కడో ఓచోట వాహనం ఆపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్‌స్పాట్‌ల వద్ద హెచ్చరిక సూచికలు లేకపోవడం, ప్రధాన రహదారులకు అనుసంధానంగా గ్రామాలను కలుపుతూ సర్వీసు రోడ్లు లేకపోవడం సమస్యగా మారింది.
95%చోదకుల తప్పిదం వల్ల ప్రమాదాలు
జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే వాహనాలు నిలపడంతో వెనుక నుంచి వస్తున్నవి వాటిని ఢీకొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, అనుభవం, అర్హత లేనివారు సైతం వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది.
0.36% వాతావరణ పరిస్థితులతో..
జిల్లాలో శీతాకాలంలో పొగ మంచు ప్రభావంతో.. ఇతర కాలంలో విపత్తులు, వర్షాల ప్రభావంతో రాకపోకల సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళల్లో జాతీయ రహదారి ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఒక ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం..
పి.గన్నవరం మండలం బెల్లంపూడి గ్రామానికి చెందిన దిరిశాల గంగరాజు, చుక్కల నాగేశ్వరరావు కూలి పనికోసం జగ్గంపేట వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. 2017 డిసెంబరు 2న లంకలగన్నవరం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరూ మృత్యువాత పడడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గంగరాజు భార్య సత్యవతి పరిస్థితి దయనీయం. ఇద్దరు పిల్లల్లో ఒకరు దివ్యాంగుడు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే వీరికి ఆధారం. నాగేశ్వరరావు మృతితో ఆయన భార్య చుక్కల వరలక్ష్మి ఒంటరైంది. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి పంపించినా.. నిర్మాణంలో ఉన్న ఇల్లు మధ్యలో ఆగిపోయింది.. ఇప్పుడు ఈమెకు పింఛను సొమ్మే దిక్కయింది.
జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల తీవ్రత ఇలా..
ఇదీ చదవండి:
'టీకా పంపిణీ, కరోనా వ్యాప్తి ఎన్నికల నిర్వహణకు కుంటి సాకులే'