తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి.. ఆమె భర్త, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణమూర్తి పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాకినాడలో శుక్రవారం కాకినాడలో ఈ విషయాన్ని ప్రకటించారు. కుటుంబ సమస్యలు, మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్పతో విభేదాలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థులను బరిలో నిలిపే పరిస్థితి లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తాము పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని అధిష్ఠానానికి కొందరు ఫిర్యాదు చేస్తే తమ వివరణ తీసుకోకుండా ఆ ఆరోపణలనే నమ్మారని వాపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రి కన్నబాబు విమర్శలు చేసిన సందర్భాల్లో తాము ఖండించడం లేదని చినరాజప్ప ఆరోపిస్తున్నారని.. తాము ఎప్పుడూ ఇతర పార్టీల నేతలను విమర్శించ లేదని వివరించారు.
మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావును కాకినాడ గ్రామీణం నుంచి పోటీ చేయాలని గతంలో తాము ఆహ్వానించగా.. ఆయన పెద్దాపురం నుంచే పోటీకి సిద్ధపడ్డారని అన్నారు. అప్పటినుంచి చినరాజప్ప కోపం పెంచుకున్నారని వాపోయారు. తాము పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేశామని, తుది వరకు తెదేపాలోనే కొనసాగుతామని వివరించారు. అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలు సత్యదూరమని చినరాజప్ప తెలిపారు. పార్టీకి నష్టం చేకూరేలా తాను ఎప్పుడు వ్యవహరించలేదని, తనపై ఆరోపణలు బాధాకరమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి. ఇప్పుడేమీ మాట్లాడొద్దు! మరి ఇంకేం మాట్లాడాలి?