అలంకరణలు, పూజలకు వినియోగించాల్సిన పూలు ఇలా రోడ్డు పాలయ్యాయి. పెళ్లిళ్ల సీజన్‌పై నమ్మకం పెట్టుకొని పెద్దఎత్తున సాగు చేస్తే కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. రాష్ట్రంలో నెల రోజులకు పైగా పగటి కర్ఫ్యూ కొనసాగుతుండటం వల్ల గిరాకీ లేక పూల వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూల విక్రయాలు చేపట్టినా, ఎంతో కొంతకు అమ్ముకుందామన్నా కొనేవారు కరవయ్యారు. ఇక చేసేది లేక ఇలా మురుగు కాలువలు, చెత్తకుప్పల్లో పూలు పారబోసి ఉసూరుమంటూ ఇళ్లకు వెళతున్నారు రైతులు. పూల మార్కెట్‌కు ప్రసిద్ధి చెందిన కడియపులంకలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మిగిలిన చోట్ల సరేసరి.
పూలు కొనే నాథుడే లేరు..
తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో విస్తారంగా పూలు సాగవుతున్నాయి. కడియం పరిసర ప్రాంతాల్లోనే సుమారు 4 వేల ఎకరాల్లో వివిధ రకాల పూలు పండిస్తున్నారు. వేసవి వచ్చిందంటే కడియపులంక మార్కెట్ విరులతో నిండిపోయేది. క్రయవిక్రయాలతో కళకళలాడేది. ఈసారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంత నష్టం వాటిల్లింది. మూడు నెలల మూఢం తర్వాత శుభముహూర్తాలు, పెళ్లిల్లు వస్తాయనుకుంటే కరోనా సెకండ్ వేవ్ ఎగిసిపడింది. కర్ఫ్యూ విధించడంతో పూలు కొనే నాథుడే కరవయ్యాడు. ధరలు పతనమై.. వ్యాపారులు, కూలీలు, కమీషన్ ఏజెంట్లు అంతులేని వేదనలో మునిగిపోయారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
భారీ పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పూలు వరుసగా రెండో ఏడాదీ తీవ్ర నష్టాల్ని మిగల్చడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని పూల రైతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: