తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో వరి పంటకు నీరందించాలని రైతులు ఆందోళనకు దిగారు. 300 ఎకరాల వరి చేలకు నెల రోజులుగా సాగునీరు అందడం లేదని దీంతో చేలు బీటలు వారాయన్నారు. ఈనిక దశలో నీరందకపోతే పంట నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులు వంతుల వారీ విధానంలో సాగునీరు అందిస్తున్నామని చెబుతునప్పటికీ మాటలకే పరిమితం అయ్యారని వాపోయారు. పలుమార్లు తమ గోడును అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని.. ఖరీఫ్‌లో తుఫానులు వల్ల పంట నష్టపోయి అప్పుల్లో ఉన్నామని, రబీ పంట అయిన చేతికి వస్తుందనుకుంటే సాగునీరందక పంట పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఎకరానికి 30 వేలు ఖర్చు చేశామని సాగునీటి ఎద్దడి వల్ల పంట నష్టపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పనుల్లో భాగంగా పంట కాలువలులో తుప్పలు, గుర్రపు డెక్క తొలగించాల్సి ఉండగా పనులు చేపట్టలేదని దీంతో వదిలే కొద్దిపాటి సాగునీరు కూడా తమ చేలకు అందడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి సాగునీరు అందించాలని కోరారు.
ఇదీ చదవండి: ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాల అడ్డగింత