తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఏలేరు ఆయకట్టు పరిధి విస్తరించి ఉంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలోని.. ఏడు మండలాల్లో విస్తరించి ఉంది.ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన కాల్వల వ్యవస్థపై నేటికీ ...57 వేల ఎకరాల భూమి సాగవుతోంది. ఏళేశ్వరం, కిర్లంపూడి, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లోని ఆయకట్టు పరిధిలో కాల్వలు పూర్తిగా విస్తరించాల్సి ఉంది. తొలిదశ విస్తరణ 127 కోట్ల అంచనాతో ప్రారంభించారు. నాలుగేళ్ల వ్యవధితో మొదలైన ఏలేరు ఆధునికీరణ పనులు ఐదేళ్లు గడుస్తున్నా...52 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
కాల్వల ఆధునికీకరణ పనుల ప్రగతి 10 శాతం దాటకున్నా... 54 కోట్ల 52 లక్షల విలువైన పనులు పూర్తి చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాల్వల విస్తరణలో కీలకమైన భూసేకరణ ముందుకు సాగకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి. కిర్లంపూడి, పిఠాపురం మండలాల పరిధిలోని గ్రామాల్లో భూసేకరణ జరగాల్సి ఉంది. వీటికి సంబంధించి సర్వే పనులు పూర్తయినా...ఇతర ప్రక్రియలో కదలిక లేదు. కొన్ని ప్రాంతాల్లో కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలంటే... కిర్లంపూడి మండలంలో 104, పిఠాపురం మండలంలో 138, పెద్దాపురం, ఏలేశ్వరం మండలాల్లోనూ 10 ఎకరాల చొప్పున భూమి సేకరించాలని అధికారులు చెబుతున్నారు. దీనికోసం రైతులకు 60 కోట్ల వరకూ పరిహారం చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పూర్తైన తర్వాత... గోదావరి జలాలను జలాశయంలోకి తోడి పోయడం వల్ల ఏలేరు నిండుకుండలా మారింది. ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తే...మెట్ట ప్రాంత రైతులకు నీటి సమస్య లేకుండా ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు.