ఉద్యోగ ప్రకటనల కోసం విద్యావంతులు ఎంతగా నిరీక్షిస్తున్నారో తెలియాలంటే తాజాగా పోస్టుమార్టం గదిలో వైద్యుడికి సహాయకుడిగా ఉండేందుకు నిరుద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులే సాక్ష్యం. ఈ పోస్టుకు పదో తరగతే విద్యార్హత. పైగా ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాలి. రూ.15వేల వరకు వేతనమిస్తారు. ఈ ఉద్యోగాల కోసం డిగ్రీ, పీజీ చదివినవారూ పోటీపడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో నాలుగో తరగతి ఉద్యోగుల ఎంపికలో భాగంగా చేపట్టిన పోస్టుమార్టం సహాయకుల పోస్టుల కోసం 150మందికి పైగా పట్టభద్రులు, ఆపై చదివినవారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 25 పోస్టులకుగానూ మొత్తం 250 మందికిపైగా పోటీ పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోని శవాగారాల్లో మృతదేహాలకు వైద్యుడు పోస్టుమార్టం చేయడానికి వీరు సాయం చేస్తారు. శరీర భాగాలను కోయడం, పోస్టుమార్టం పూర్తయ్యాక వాటికి కుట్లు వేయడం వంటివి వారి విధులు.
ఇదీ చదవండి:Three Capitals: మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: సీఎం జగన్