తూర్పు గోదావరి జిల్లాలో 80శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా అనపర్తిలో 87.48, రాజానగరంలో 87.47, రామచంద్రపురంలో 87.11శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా రాజమహేంద్రవరం నగరం నియోజకవర్గంలో 66.34శాతం ఓటర్లు ఓట్లు వేశారు.
జిల్లాలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం పెద్దాపురం. జిల్లా నుంచి కీలక హోం మంత్రిగా వ్యవహరించిన చినరాజప్ప బరిలో నిలిచారు. వైకాపా తరఫున మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి బరిలో నిలిచారు. ఇరువురూ..తమ గెలుపుపై ధీమాతో ఉన్నారు.
మరో కీలక నియోజకవర్గం తుని. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జగ్గంపేటలోనూ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకు వైకాపా నుంచి గట్టి పోటీ ఎదురైంది. వైకాపా తరఫున జ్యోతుల చంటిబాబు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు.
అత్యంత ఆసక్తిగా మారిన మరో నియోజకవర్గం రాజమహేంద్రవరం గ్రామీణం. తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బరిలో నిలవగా....వైకాపా తరఫున ఆకుల వీర్రాజు, జనసేన తరఫున కందుల దుర్గేష్ పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో ముక్కోణ పోరు సాగింది. కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాల్లోనూ తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థులు వనమాడి కొండబాబు, పిల్లి అనంత లక్ష్మిలు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
రామచంద్రపురం నియోజకవర్గంలో తెదేపా తరఫున సీనియర్ నేత తోట త్రిమూర్తులు, వైకాపా తరఫున జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చెల్లిబోయిన వేణుగోపాల్, జనసేన తరఫున పోలిశెట్టి చంద్రశేఖర్ పోటీ చేశారు. సామాజిక వర్గాలే ప్రధానాంశంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికలు సాగాయి.
మండపేటలో తెదేపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హ్యాట్రిక్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈయనపై వైకాపా తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు. గెలుస్తామనే ధీమా ఇద్దరికీ ఉంది. రంపచోడవరంలో తెదేపా, వైకాపాలతోపాటు సీపీఎం పోటీలో నిలిచింది. ఇక్కడ ఎవరికి వారు గెలుపుపై ఆశతో ఉన్నారు.
పిఠాపురంలో గెలుపు ఏ పార్టీది అన్న అంశంపైనా ఆసక్తి నెలకొంది. తెదేపా తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ, వైకాపా తరఫున పెండెం దొరబాబు పోటీ చేశారు. జనసేన ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపనుంది. ముమ్ముడివరం నియోజకవర్గంలో తెదేపా, వైకాపాతోపాటు జనసేన గట్టి పోటీ ఇచ్చింది. తుని, అనపర్తి, అమలాపురం శాసనసభ స్థానాల్లో వైకాపా విజయం సాధిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా ఉంది.
పార్లమెంటులో...
పార్లమెంటు స్థానాల్లోనూ తెదేపా తరఫున రాజమహేంద్రవరంలో ప్రస్తుతం మాగంటి రూప, వైకాపా తరఫున మార్గాని భరత్ బరిలో నిలిచారు. తెదేపా-వైకాపా అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో ధీటుగా వ్యవహరించిన మార్గాని భరత్‌ను విజయం వరిస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. జనసేన నుంచి ఆకుల సత్యనారాయణ పోటీలో ఉన్నారు.
అమలాపురం నుంచి తెదేపా తరఫున హరీష్ మాథుర్ పోటీ చేయగా... జనసేన, వైకాపా అభ్యర్థులు డీఎంఆర్ శేఖర్, చింతా అనురాద ముందంజలో ఉన్నారు. కాకినాడ నుంచి వైకాపా తరఫున మాజీ ఎంపీ వంగా గీత, తెదేపా నుంచి చలమలశెట్టి సునీల్ పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీ తెదేపా, వైకాపా మధ్యే ఉంది.