ఫ్లాగ్ మార్చ్
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా... తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. అనపర్తిలో చేసిన మార్చ్‌లో డీఎస్పీలు రామచంద్రమూర్తి, మురళీమోహన్ పాల్గొన్నారు. విధుల్లో అలసత్వంగా ఉండకూడదనీ.. లాఠీ లేకుండా హాజరైన కానిస్టేబుళ్లను డీఎస్పీ మందలించారు.
బిక్కవోలులో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌లో డీఎస్పీ ఎలియా సాగర్, అనపర్తి సీఐ, 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
అధికారులకు శిక్షణ
అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలాల్లో నాలుగో విడత పంచాయతీ ఎన్నకిలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా మండలాలకు సంబంధించిన పోలింగ్ అధికారులు, సహాయక పోలింగ్ అధికారులుక శిక్షణ తరగతలు నిర్వహించారు. సమస్యలు ఎదురైనపప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించటం.. పరిష్కారాలు చెప్పటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని అమలాపురం సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. అయినవిల్లి మండలం కే జగన్నాధపురం పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్... ఎన్నికల సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించే విధంగా.. ఎన్నికల సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఓటర్లకు ప్రలోభాలు
ఆలమూరు మండలం మోదుకూరులో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న... వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసులు గస్తీ కాస్తుండగా.. సిబ్బందిని చూసి కొంతమంది వ్యక్తులు పారిపోతుండగా.. గ్రామానికి చెందిన యడ్లపల్లి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతనని విచారించగా.. అతడి బంధువు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడనీ.. గెలిపించాలని ఓటుకు 500 రూపాయలను పంచిపెడుతున్నట్లు తెలిపాడు. నిందితుడి నుంచి 14,500 నగదు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పట్టుబడ్డ వ్యక్తి అదే గ్రామంలో నాలుగో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికురాలిగా.. గ్రామ ప్రథమ మహిళ