తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు... జిల్లా వైద్యఆరోగ్య అధికారి డాక్టర్ మల్లికార్జున అన్నారు. ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించి, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జి మామిడాడలో పాజిటివ్ కేసులు పెరగటానికి ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటమే కారణమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 48,981 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జిల్లాలో కరోనా సోకి ఒకరు చనిపోగా, మరో ఇద్దరు ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో 5వ విడత ఆరోగ్య సర్వే కొనసాగుతోందని... అనుమానిత లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: జిల్లాలో విజృంభిస్తున్న కరోనా