విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో భారీ కర్మాగారాలు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రమాదకర పరిశ్రమలు 86 ఉంటే అందులో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా 21 ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి దృష్టి సారించారు. గ్యాస్, ఇంధన వెలికితీత పరిశ్రమలతో పాటు ఇతర ఎరువులు, ప్రధాన కర్మాగారాల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
లాక్‌డౌన్ అనంతరం పరిశ్రమలు మళ్లీ తెరుచుకునే క్రమంలోనే ప్రమాదాలకు ఆస్కారం ఉందని... అయితే జిల్లాలో ఆ పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి సమర్థంగా పనిచేస్తున్నాయన్న ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుందని కర్మాగారాల తనిఖీల విభాగానికి సూచించారు. అన్ని పరిశ్రమల్లోనూ మాక్‌డ్రిల్ నిర్వహించి కర్మాగారాల లోపల పని చేస్తున్న వారితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్ సంస్థల పైపు లైన్లు ఉన్న ప్రాంతాలపై జాగ్రత్తల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. గతంలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటనలు, బ్లో అవుట్‌లు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు భద్రత, పైపులైన్ల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి..