బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. కోనసీమలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు అవస్థలు పడ్డారు. అనేక చోట్ల దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి.
కాకినాడలో....
వాయుగుండం తీరం దాటే సమయంలో కాకినాడలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. లోతట్టు కాలనీల్లో ఇళ్లు ముంపుబారిన పడ్డాయి. కోనసీమలో దేవాలయాల్లోకి వరద చేరింది. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయం ముంపునకు గురైంది. హుండీలు తడిసిపోయాయి.
అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో గర్భగుడిలోకి వాన నీరు చేరింది. పుల్లేటికుర్రులో ఫారాలు మునిగి కోళ్లు చనిపోయాయి. గండేపల్లి, పి.గన్నవరం, ఐ.పోలవరంలో విద్యుత్ తీగలపై చెట్లు విరిగి పడటం వల్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
కోనసీమలో....
కోనసీమ ప్రాంతమైన అమలాపురం డివిజన్‌లో గాలులకుకు పలుచోట్ల చెట్లు పడిపోయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాత్రి వీచిన బలమైన గాలులకు ప్రత్యేకించి ట్రాన్స్‌కో కు రూ. 50 లక్షల మేర నష్టం వాటిల్లిందని అమలాపురం డివిజన్ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. సాల్మన్ రాజు వెల్లడించారు.
అమలాపురం డివిజనేలోని అమలాపురం పి. గన్నవరం రాజోలు సఖినేటిపల్లి ఆత్రేయపురం మమ్మిడివరం కాట్రేనికోన తదితర మండలాల్లో 150 విద్యుత్ స్తంభాలు, 47 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. 15 కిలోమీటర్ల మేర వైర్ తెగిపోయింది. ఈ కారణంగా 76 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే వాటిని పునరుద్ధరించి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు.
రాజమహేంద్రవరంలో...
ముంచెత్తిన వర్షానికి రాజమహేంద్రవరంలో తహసీల్దారు కార్యాలయం నీట మునిగింది. కోటిపల్లి బస్టాండ్, ఐఎల్టీడీ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డులో మోకాళ్ల లోతు నీరు చేరడం వల్ల జనాలు ఇబ్బంది పడ్డారు. కోలమూరులో గుర్రపు చెరువు పొంగి... విమానాశ్రయానికి వెళ్లే రహదారినిపై ప్రవహించింది. దీంతో వాహనాలు నీటిలో ఆగిపోవడం వల్ల చోదకుల అవస్థలు వర్ణనాతీతం. బొమ్మూరు చెరువు, బాలాజీపేట కాలనీలు జలమయమయ్యాయి.
రామచంద్రపురం డివిజన్‌లో..
రామచంద్రపురం డివిజన్‌లోని కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, కె.గంగవరంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనపర్తి మండలం దుప్పలపూడిలో విద్యుత్తు సబ్ స్టేషన్ నీట మునిగింది. బిక్కవోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వరద చేరింది. పెదపూడి మండలంలో పశ్చిమ ఏలేరు కాలువ పొంగిపొర్లింది.
రంపచోడవరం ఏజెన్సీలో....
తుఫాను ప్రభావంతో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో జలాశయాలు నిండుకుండలా మారాయి. కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజనులు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఏజెన్సీ ప్రాంతంలో భూపతిపాలెం, సూరంపాలెం, మద్ది గడ్డ రిజర్వాయర్లు నీటితో నిండాయి.
204 మీటర్ల సామర్థ్యం కలిగిన భూపతిపాలెం జలాశయంలో 203 మీటర్లకు నీరు చేరడం వల్ల రెండు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. రంపచోడవరంలో గొట్టాల రేవు వీధిలో సీతపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున బట్టలు ఉతుకుతున్న గెంత దేవి కుమారి అనే మహిళ వాగులో కొట్టుకుపోతుండగా స్థానిక యువకులు ఆమెను కాపాడారు.
ఏలేశ్వరంలో...
ఏలేశ్వరం మండలం యర్రవరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి 4 అడుగులకు పైగా నీరు నిలిచింది. పీకల్లోతు ఉన్న నీటిలో నడుచుకుంటూ వెళ్లి ఈ స్థలాలను తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ వరుపుల రాజా పరిశీలించారు.
పెద్దాపురం నియోజకవర్గంలో...
భారీ వర్షాల కారణంగా పెద్దాపురం మెయిన్‌రోడ్‌లోని పురపాలక వాణిజ్య సముదాయం స్లాబ్ చివరి భాగం మొదటి అంతస్థు షేడ్ కూలిపోయింది. వ్యాపార సంస్థలకు సెలవు కావడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. పురపాలక శాఖ అధికారులతో కలిసి పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
భారీ వర్షాల కారణంగా వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు నీటమునిగాయి. రహదారులు చిన్నాభిన్నం అయ్యాయి. దీంతో రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారయ్యాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యు.కొత్తపల్లిలో...
యు.కొత్తపల్లి మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో ఎంపీ గీత, కలెక్టర్ పర్యటించారు. కోతకు గురైన ఉప్పాడ, సూరాడపేట, మాయాపట్నం ప్రాంతాలను పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న వరద బాధితులతో మాట్లాడారు. కేంద్రంలో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
యానాంలో ...
యానాంలో రహదారులు చెరువులను తలపించాయి. ప్రముఖ పిల్లారాయ ఆలయంలోకి వరద చేరింది. ఫలితంగా ఆలయ నిర్వహకులు దర్శనాలు నిలిపివేశారు. ధాన్యం మిల్లులోకి నీరు చేరి బియ్యం రాశులు తడిసిపోయాయి.
వాయుగండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. పంట నీట మునగడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయాని ఆవేదన చెందుతున్నారు.