తూర్పు గోదావరి జిల్లాలో గ్రామీణ జనాభా 41 లక్షలు. 1,103 పంచాయతీల పరిధిలో 11 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో గతేడాది మార్చి నుంచి సరైన ఉపాధి లేక చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇళ్లలో పరిస్థితులు చక్కదిద్దుకునే క్రమంలో వ్యవసాయ, ఇతర పనులకు వెళ్తున్నవారు గుంపులుగా ఒకేచోట శ్రమిస్తుండడం.. లాంటివి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పల్లెలకు రాకపోకలు పెరగడం.. మాస్కు, భౌతిక దూరం అవగాహన లేమి వంటివి వైరస్ వ్యాప్తికి కారణంగా మారాయి.
20 రోజులు.. 15 మరణాలు..
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామంలో 20 రోజుల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో తొమ్మిది మంది కరోనా మృతులని అధికారికంగా నిర్ధారించారు. గ్రామంలో 128 పాజిటివ్ కేసులు గుర్తించారు. మరికొందరు ప్రైవేటుగా కరోనా పరీక్షలు చేయించుకుని వైద్యం
పొందుతున్నారు.'
మూడు వారాల్లో 11 మంది..
మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలో వ΄డు వారాల వ్యవధిలో 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పుడు గ్రామంలో 40 మంది పీడితులు ఉన్నారు.
ఇంటింటా కన్నీటి జాడలే..
- మలికిపురం మండలంలోని గూడపల్లిలో పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనాతో మృతిచెందారు.
- అమలాపురం మండలం సమనస గ్రామంలో ఓ కుటుంబాన్ని మహమ్మారి కమ్మేసింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కుమార్తె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో 80 ఏళ్ల తల్లి ఇంట్లోనే మృత్యువాత పడ్డారు. వృద్ధురాలి కొడుకు, కోడలూ చికిత్స పొందుతున్నారు.
- ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. ఏప్రిల్ 30న కుటుంబ పెద్ద చనిపోతే.. ఈనెల 7న ఆయన సోదరుడు, మరదలు మృతిచెందారు.
- కోరుకొండ మండలంలోని బుచ్చంపేటకు చెందిన తాతారావు, మంగతాయారు దంపతులు వైరస్ కారణంగా గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం వేదనను మిగిల్చింది.
ఇళ్లలోనే మగ్గుతున్నారు..
- పల్లెల్లో గతంలో పాజిటివ్ ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ ఆంక్షల హెచ్చరిక ఉండేది. బ్లీచింగ్, హైపోక్లోరైడ్ చల్లి.. ఆ ప్రాంతాలకు ఇతరులు రాకుండా నిలిపివేసేవారు. రెడ్‌జోన్‌గా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడా పరిస్థితిలేదు. పాజిటివ్ వ్యక్తులు వ్యక్తిగత అవసరాల కోసం బయట విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు.
- వైరస్ లక్షణాలున్నవారు బయట పడితే ఊర్లో వెలివేసినట్లు చూస్తారనే భయంతో పరిస్థితి విషమించినంతవరకు గుట్టుగా ఉంచుతున్నారు. దీంతో సమస్య ఎదురవుతోంది.
- పల్లెల్లోని నివాసాల్లో ప్రత్యేక గదులకు ఆస్కారం తక్కువ. ఇరుకు గదుల్లో ఉమ్మడి కుటుంబాలున్నాయి. దీంతో వ్యాధి వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ.
- గతంలో పాజిటివ్ కేసు నమోదైతే ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఆద్యంతం పర్యవేక్షించేవారు. ఇప్పుడు నిత్యం వేలల్లో కేసులు నమోదవుతుండడంతో పర్యవేక్షణ లోపించింది. సకాలంలో హోమ్ ఐసోలేషన్ కిట్లు అందని పరిస్థితి చాలాచోట్ల ఉంది. ఈ క్రమంలో ఔషధ దుకాణాలకు వెళ్లి వారిచ్చిన మందులు కొని వాడేస్తున్నారు. కొందరు కోలుకుంటున్నా.. మరికొందరు ఆరోగ్యం పాడై.. రోగం ముదిరినంత వరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
కొవిడ్ కేర్ సెంటర్లు అందుబాటులో ఉన్నా..
జిల్లాలో కాకినాడ, బొవ΄్మరు, బోడసకుర్రు కొవిడ్ కేర్ సెంటర్లలో ఆరువేల పడకలు ఉన్నాయి. పల్లెల్లో ఇళ్లలో వైద్యానికి అవకాశం లేనివారు ఆయా కేంద్రాల్లో చికిత్సకు వీలుంది. అక్కడ వైద్యనిపుణులు, సిబ్బంది, ఆక్సిజన్ పడకలు, అత్యవసర మందులూ అందుబాటులో ఉంచారు. కానీ ఈ పడకలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదు. ఆరువేల పడకల్లో రెండు వేల వరకు మాత్రమే పడకలు నిండుతున్నాయి.
పాజిటివిటీ రేటు పైపైకి..
పల్లెల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 30 నుంచి 35 శాతం మధ్యలో ఉంటోంది. నిత్యం కొన్నిచోట్ల పదుల సంఖ్యలో.. మరికొన్నిచోట్ల వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండడం కలవరపరుస్తోంది. గతంలో పెదపూడి మండలంలోని జి.మామిడాడ అత్యధిక కేసులతో కలకలం రేపితే.. ఇప్పుడు అన్ని మండలాల్లోనూ అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ్య కాకినాడ, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాలతోపాటు.. అమలాపురం, ఉప్పలగుప్తం, మామిడికుదురు, రాజానగరం, కొత్తపల్లి, మండపేట, గంగవరం, రాయవరం తదితర మండలాల్లో నిత్యం అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మన్యంలోని ఎటపాక, రంపచోడవరం డివిజన్లలోని గ్రామాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.
పీడితులను గుర్తిస్తున్నాం..
గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అందరూ కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. గ్రామాల్లో లక్షణాలున్నవారు గోప్యంగా ఉంచడం, వైద్యం అనుభవంలేని వారిని ఆశ్రయించడంతో సమస్య వస్తోంది. ఇంట్లో హోమ్ ఐసోలేషన్‌కు అవకాశం లేనివారు కాకినాడ, బొవ΄్మరు, బోడసకుర్రు ప్రాంతాల్లో కొవిడ్ కేర్ సెంటర్లలో చేరవచ్చు. ప్రజల తాజా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఈ నెలాఖరు వరకు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటింటి సర్వేద్వారా అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి అవసరమైన వారికి సకాలంలో వైద్యం అందేలా చూస్తాం. - డాక్టర్ గౌరీశ్వరరరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
15 రోజుల్లో మండలాల్లో పాజిటివ్ కేసులు ఇలా..
కాకినాడ గ్రామీణం 1,244 , అమలాపురం 811 ,రాజమహేంద్రవరం గ్రామీణం 688 ,ఉప్పలగుప్తం 645 , కె.గంగవరం 638 , కాజులూరు 617 , మామిడికుదురు 590, రాయవరం 586 , రామచంద్రపురం 575 . కొత్తపేట 563 , రాజానగరం 555 , కొత్తపల్లి 543 , అల్లవరం 511 , పి.గన్నవరం 497 , రావులపాలెం 439 తొండంగి 425 , బిక్కవోలు 405