ఆర్య వైశ్య సామాజికవర్గంలో పేద మహిళలకు వసతి, విద్య, వైద్యం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నాళం రామలింగయ్య అనే వ్యక్తి 1922లో వైశ్య సేవా సదనం స్థాపించారు. దీనికోసం అప్పట్లోనే 565 ఎకరాలను సేకరించారు. ఈ భూములపై వచ్చే రాబడితోనే సేవాసదనం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. సుదీర్ఘకాలం సదనం సేవలు అందించటంతో ఆస్తులన్నీ కరిగిపోయాయి. రాజానగరం మండలం వెలుగుబందలో మాత్రం 32.26 ఎకరాల భూమి సదనం పేరిట ఉన్నాయి.
ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు అందించేందుకు ఈ భూములు విక్రయించాలని సేవాసదనం ప్రతినిధులను సంప్రదించారు. దీనికి అంగీకరించిన సంఘ సభ్యులు ఎకరం 45 లక్షల రూపాయల చొప్పున భూములన్నీ అమ్మేశారు. దీనికి సంబంధించిన 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం... సంఘానికి చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేసింది.
వైశ్య సేవాసదనం వంశపారంపర్య ధర్మకర్త నాళం వెంకటేశ్, కార్యదర్శి రామచంద్రరావు ...సదనానికి చెందిన ఆస్తులన్నీ దేవదాయశాఖలో విలీనం చేశారు. 2017లోనే వైశ్య సేవాసదనం దేవదాయశాఖలో విలీనం చేస్తూ ...రిజిస్టర్ సెక్షన్ -43లో నమోదు చేశారు.
దీంతో సేవాసదనం ఆస్తులన్నీ దేవదాయశాఖ పరిధిలోకి వెళ్లినట్లే. ఈ నేపథ్యంలో ఈ భూములను ప్రభుత్వానికి విక్రయించడం తీవ్ర వివాదమవుతోంది. అయితే విలీన ప్రక్రియ గురించి తమకు తెలియదని ప్రస్తుత సంఘ సభ్యులు చెబుతున్నారు.
దేవాదాయ శాఖ రిజస్టర్ సెక్షన్ -43 లో నమోదైన భూములు అమ్మాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరి. కానీ రాజమహేంద్రవరంలోని సదనం భూములు ఎలాంటి అనుమతులు లేకుండానే అమ్మేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై దేవదాయశాఖ విచారణ జరుపుతోందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కలహాల కాపురం.. తీసింది ముగ్గురి ప్రాణం