ఆన్‌లైన్‌లో ఇసుక అమ్మకాలు జగన్మాయలా మారాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పార్టీనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఇసుక సంక్షోభం మానవ తప్పిదమేనని స్పష్టం చేశారు. వైకాపా నేతల స్వార్థానికి రోజు కూలీలు బలవుతున్నారని మండిపడ్డారు. సొంతూళ్లలో వాగులో ఇసుక తెచ్చుకోడానికి అడ్డంకులు సృష్టించి.. 10 రెట్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.
గోదావరి - కృష్ణా అనుసంధానాన్ని రివర్స్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. జలాశయాలు ఎందుకు నింపలేదని సీఎం ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. చింతమనేని ప్రభాకర్, అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టారని.. వల్లభనేని వంశీని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం కార్యకర్తలు నిలబడ్డారని కొనియాడారు.
మానవ హక్కుల కమిషన్ బృందం నేటి నుంచి నవంబర్ 1వరకు రాష్ట్రంలో పర్యటిస్తోందని.. వైకాపా బాధితులంతా వారిని కలవాలని చంద్రబాబు సూచించారు. గత 5 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 620 చోట్ల అరాచకాలకు పాల్పడ్డారని... వీటన్నింటినీ మానవ హక్కుల బృందం దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి