దళిత స్నేహితుడి తరపున సాక్షి సంతకం చేసినందుకు తనను కులం నుంచి బహిష్కరించారని.. పందిరి వెంకట్రావ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో ఈ ఘటన జరిగింది. మిత్రుడు రాజబాబు కొనుగోలు చేసిన స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో సహకరించినందుకు ఈ చర్యకు దిగారని పేర్కొన్నాడు. గ్రామస్థులెవరూ తమ కుటుంబానికి మద్దతు ఇవ్వకూడదని కులపెద్దలు ప్రచారం చేశారని తెలిపాడు. తన కుమారుడి వివాహానికి ఎవరినీ రానివ్వకపోగా.. హాజరైన ఐదు కుటుంబాలనూ బహిష్కరించినట్లు వెల్లడించాడు. ఏ శుభకార్యానికి తమను పిలవడం లేదని.. ఎవరూ తమ ఇళ్లకు రావడం లేదని చెప్పాడు.
ఆత్మహత్యే శరణ్యం:
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధితుడు వెంకట్రావ్ వాపోయాడు. కులం నుంచి బహిష్కరించి తమ కుటుంబాన్ని మానసికంగా హింసిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేం జరిగింది:
రాజబాబు గతంలో కొనుగోలు చేసిన స్థలం ఆలయానికి పక్కనే ఉండగా.. అది కోవెలకు చెందినదేనని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ధ్రువపత్రాలను పరిశీలించిన అదికారులు.. దేవాలయానికి సంబంధించినది కాదని తేల్చారు. దస్తావేజులపై వెంకట్రావ్ సాక్ష్యమూ ఉందని తెలుసుకున్న కుల పెద్దలు.. అతని కుటుంబానికి ఎవరూ సహకరించకూడదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: తేటగుంట జాతీయ రహదారిపై ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు