Case On Journalists: రైతులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది విలేకర్లపై కేసు నమోదు చేసినట్లు అనపర్తి సీఐ విపత్తి శ్రీనివాస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో పగలు ఎండ తీవ్రత వేడి గాలుల కారణంగా రాత్రి సమయంలో పొలాల్లోని ఎత్తు పల్లాలు సరిచేసుకుంటున్న రైతులను డబ్బులు ఇవ్వాలంటు డిమాండ్ చేయడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేశారని రైతులు తమకు ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా ఇల్లపల్లి గ్రామంలో రైతులు తమ పొలంలో మట్టి పని చేసుకుంటుండగా కొందరు విలేకరులు మట్టి పని చేయడానికి అనుమతి ఉందా అనుమతులు లేకుండా పని ఎలా చేస్తారంటూ బెదిరించారని తమ పొలంలో పని చేసుకునేందుకు కూడా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని రైతులు వాపోయారు. మా పొలంలో మేము మట్టి పని చేసుకుంటే అనుమతులు ఎందుకని మెరక ఉన్నచోట మట్టి తీసి పల్లంగా ఉన్నచోట మట్టి వేసుకుంటున్నామని, పగటిపూట ఎండ వేడి తట్టుకోలేక రాత్రిపూట చేసుకుంటున్నామని వెల్లడించినా విలేకరులు వినలేదన్నారు. ట్రాక్టర్లు, జెసీబీ డ్రైవర్ల వద్దకు వెళ్లి లైసెన్సులు ఉన్నాయా.. అవి లేకుండా ఎలా తిప్పుతున్నారంటూ ఘర్షణకు దిగారని అన్నారు. విలేకరుల పేరుతో అక్రమ ఆర్జనకు పాల్పడడం సమంజసమేనా అంటూ పోలీస్ స్టేషన్ వద్ద రైతులు నినదించారు.
రైతుల ఫిర్యాదుతో కేసు 13 మందిపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఎవరైనా విలేకర్లు బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
పొలంలో మట్టి చేసుకుంటున్న మమ్మల్ని విలేకరులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు అనుమతి ఉందా.. ట్రాక్టర్లు, జెసీబీ నడపకూడదు అది రూల్స్ వ్యతిరేకంగా చేయటం అని ప్రతి విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా పని మేము చేసుకుంటుంటే.. రూల్స్ మాట్లాడుతూ బండికి ఆర్సీ ఉందా.. సీ బుక్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మేము రోడ్డు మీద బండి నడపట్లేదు కదా అంటే.. అదంతా మాకు తెలియదు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.- రైతు
బిక్కవోలులో 15 మంది వ్యక్తులు విలేకరులు రైతులు తమ పొలంలో మట్టి పని చేస్తుంటే అక్కడికి వెళ్లారు. అనంతరం మీకు అనుమతి ఉందా అని రైతులతో పాటు ట్రాక్టర్లు, జెసీబీల డ్రైవర్ల వద్దకు వెళ్లి లైసెన్సులు ఉన్నాయా.. అవి లేకుండా ఎలా తిప్పుతున్నారంటూ బెదిరించారు. అయితే రైతులు మా పొలంలో మెరక ఉన్నచోట మట్టి తీసి పల్లంగా ఉన్నచోట మట్టి వేసుకుంటున్నామని సమాధానం చెప్పారు. అనంతరం విలేకరులు ఘర్షణకు దిగి వారి దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. -శ్రీనివాస్, అనపర్తి సీఐ