పోలవరం నిర్వాసితులపై ముఖ్యమంత్రి జగన్.. సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని నిర్వాసితుల కాలనీలలో ఆయన పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తమకు నిర్మించిన కాలనీలలో మంచినీటి సదుపాయం, విద్యుత్, మరుగుదొడ్లు , రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు, నిర్వాసితులకు ప్యాకేజీ కింద రూ.7 వేల కోట్లు ఇచ్చిందని సోము వీర్రాజు అన్నారు. అదనంగా మరో మూడు వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి నిర్వాసితులు ఎంతో త్యాగం చేశారని అటువంటి వారికి ప్యాకేజీ చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలో పోలవరం ప్రత్యేక కమిషనర్ ఆనంద్‌ను కలుస్తామన్నారు.
2013లో నిర్మించిన కాలనీలకు..ఇప్పటివరకు రూపురేఖలు లేకపోవటం దారుణమని సోము వీర్రాజు అన్నారు. నిర్వాసితులను ఆదుకోవటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టు 78 శాతం పూర్తయితే..నిర్వాసితుల ఇచ్చిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు 21 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం ధారపోసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం దారుణమన్నారు. వారికి రావాల్సిన ప్యాకేజీ, హక్కుల కోసం భాజపా అండగా నిలబడుతోందని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వాసితులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు.
ఇదీ చదవండి
CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'