జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న సమ్మె వల్ల తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకులు మూసివేశారు. రాజమహేంద్రవరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద బ్యాంకు సిబ్బంది నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ వల్ల ఖాతాదారులకు సరైన సేవలు అందవని, సేవా రుసుములు పెరుగుతాయని అన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన కార్పొరేటర్ల నుంచి వసూళ్లు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు.
బ్యాంకు ఉద్యోగులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జిల్లాలోని తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లోని అన్నీ బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శని, ఆదివారాలు సెలవు.. ఈ రోజు, రేపు సమ్మె నిర్వహించనున్నారు. దీంతో ఏటీఎం సెంటర్లలోనూ నగదు అందుబాటులో లేదు.
జిల్లాలో అంతర్బాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ బ్యాంకు సేవలు నిలిచిపోయాయి. అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. ఈ రెండు రోజులు బ్యాంకులు మూతపడటంతో.. అభ్యర్థులు తమ నామినేషన్లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల ధర్నా