తూర్పుగోదావరి జిల్లాలో కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో యువకులకు పోలీసులు కరోనా నియంత్రణ పై అవగాహన కల్పిస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్ తన కార్యాలయం వద్ద యువకులకు జిల్లాలోని కరోన ఉద్ధృతిని వివరించారు. రానున్న మూడు నెలల్లో మరింత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించటం.. శానిటైజర్ వాడటం.. దుకాణాల వద్ద బహిరంగ ప్రదేశాల్లోనూ భౌతిక దూరం పాటించటం తప్పనిసరిగా పాటించాలని.. తమ గ్రామ ప్రజలందరూ ఇవే నియమాలు పాటించేలా వీరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పక్కనే ఉన్న ముమ్మిడివరం పరిధిలోని నాలుగు మండలాల్లో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆ ప్రభావం యానం పైన తీవ్రంగా పడింది. యానంలో ఉంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారానే సుమారు 28 మంది కరోనా బారినపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో ఉండే యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి నిందితుడికి కరోనా... పోలీసుల్లో ఆందోళన