తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఓ చిరుతపులి బీభత్సం సృష్టించింది. అంకంపాలెం అనే గ్రామంలో సోమవారం రాత్రి కొబ్బరి చెట్టు ఎక్కింది. చెట్టుపై నుంచి దిగి వల్లోకి చిక్కకుండా పొలాల్లోకి పారిపోయింది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిరుత తప్పించుకుందని గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
అసలేం జరిగిందంటే...
అంకంపాలెంలో సోమవారం ఓ రైతుకు చిరుతపులి కనిపించింది. అతను భయంతో పరుగులు తీశాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అప్పుడే పులి నలుగురిపై దాడి చేసింది. గాయపర్చింది. ఇక లాభం లేదని గ్రామస్థులు కర్రలతో దాడికి దిగారు. భయంతో ఆ చిరుత మామిడి చెట్టు ఎక్కింది. దానిపై నుంచి నెమ్మదిగా పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపైకి వెళ్లింది. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని చిరుతను బంధించేందుకు ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొబ్బరి చెట్టు దిగి చిరుత పారిపోయింది.ఆ ప్రయత్నం కాస్తా వృథా కావడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తంచేస్తున్నారు.