కేంద్రపాలిత ప్రాంతం యానాంలో పుదుచ్చేరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శాంతి చిహ్నాలైన పావురాలను.. త్రివర్ణ బెలూన్లను డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తో కలిసి గాలిలోకి వదిలారు. కొవిడ్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు.
రంపచోడవరంలో...
అమరజీవి పొట్టి శ్రీరాములు సాగించిన పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఆర్డీవో సీనా నాయక్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రంపచోడవరం ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీఓ... పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గన్నవరంలో...
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు మహోన్నతమైన వ్యక్తి అని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పి. గన్నవరం లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే చిట్టిబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు.
కొత్తపేటలో...
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రావులపాలెంలోని వైకాపా కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలం లో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో శ్రీరాములు విగ్రహానికి సంఘ సభ్యులు పూలమాలలు వేశారు.
ఇదీ చదవండి: