తూర్పుగోదావరి జిల్లా కేశవదాసుపాలెంలో ఓ రైతు తన కుమార్తె పెళ్లికి కట్నం కింద.. కౌలుకు తీసుకున్న ఆలయ భూమిలో ఎకరం అల్లుడికి ఇచ్చారు. మిగిలిన భూమి కొడుకులకు భాగాలుగా ఇవ్వగా వీరంతా సాగు చేసుకుంటున్నారు. ఇదే రీతిన శృంగవరప్పాడు, గొంది గ్రామాల్లో 30 ఎకరాలపైనే చేతులు మారింది.
''అంతర్వేది... శ్రీకర శుభకర ప్రణయ స్వరూప వేదిక. ఈ దివ్య క్షేత్రాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రానికి రూ.కోట్ల విలువైన భూములు ఉన్నాయి. కానీ ఇక్కడ కొలువైన స్వామికి దక్కేది అరకొరే. అన్నీ ఉన్నా ఏమీలేని పేదలా స్వామి దర్శనమివ్వడం భక్తులను కలచివేస్తోంది. ఆలయ భూములు ఆక్రమణదారులకు ఆదాయ వనరుగా మారాయి. లీజు ముసుగులో కొంత భూమిలో వందల నిర్మాణాలు పుడితే.. మరికొంత భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు వెలిశాయి. మరికొన్ని చేతులు మారి అన్యాక్రాంతమయ్యాయి. దస్త్రాల్లో లీజుదారుల పేరున్నా.. క్షేత్రస్థాయిలో పెత్తనం పెద్దోళ్ల చేతుల్లోకి వెళ్లింది.''
స్వామి భూమి.. మా ఇష్టం..
ఆలయ భూముల్లో దర్జాగా రొయ్యల చెరువులు తవ్వేశారు. ఎకరానికి ఏడాదికి రూ.200 నుంచి రూ.1,500 వరకు దేవాదాయ శాఖకు లీజు కడుతూ.. అడ్డదారిన రూ.20 వేలు నుంచి రూ 30 వేలకు బయట వ్యక్తులకు కొందరు అనధికారిక లీజులకు ఇచ్చారు. వారు రొయ్యల చెరువులు తవ్వి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
ఆలయ భూముల్లో అనధికారికంగా 650 ఇళ్లు నిర్మించేశారు. అంతర్వేది కర, కేశవదాసుపాలెం, శృంగవరప్పాడు, గొంది, సఖినేటిపల్లి లంక ప్రాంతాల్లో లీజుకు భూముల్లో వందల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్ని బహుళ అంతస్తులు ఉన్నాయి. పలుచోట్ల భూములను రూ.లక్షలకు అమ్మేసిన తీరూ ఉంది.
అధికారికం 1,700.. అదనం 1,500
అంతర్వేది దేవస్థానం ఆధీనంలోని మొత్తం భూమిలో 26 ఎకరాల్లో రోడ్లు, కాలువలు ఉన్నాయి. 447.77 ఎకరాల పల్లం భూమిలో వరి సాగవుతోంది. 416 ఎకరాల మెరక భూమిలో కొబ్బరి, సరుగుడు తోటలు ఉన్నాయనేది అధికారిక లెక్క. ఆయా భూముల్లో అధికారికంగా 1,700 మంది కౌలుదారులు.. అనధికారికంగా మరో 1,500 మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారు. క్రమేణా ఈ భూముల్లో అనుభవదారులు పెరిగారు.
తూర్పున ఇలా.. పశ్చిమంలో అలా
తూర్పులో వరి సాగు చేస్తున్న పల్లం భూమిలో ఏడాదికి ఎకరానికి నాలుగు నుంచి ఆరు బస్తాల ధాన్యం లీజు కింద వస్తోంది. తద్వారా రూ.3,500 నుంచి రూ.5 వేలు వరకు ఆదాయం వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 35 ఎకరాల పల్లం భూమికి ఎనిమిది నుంచి 10 బస్తాలు ధాన్యం లీజుగా వసూలవడం గమనార్హం. అధికారిక వివరాల మేరకు ధాన్య రూపంలో 3,171 బస్తాలు, ధన రూపంలో రూ.6 లక్షలు వసూలవుతున్నాయి. ఈలెక్కన ఏడాది ఆదాయం రూ.35 లక్షలు వరకు ఉంటోంది. సరుగుడు, కొబ్బరి తోటలు, ఖాళీ స్థలాలుగా ఉన్న మెరక భూమికి ఎకరాకు రూ.200-రూ.1,500 చొప్పున మాత్రమే లీజు వస్తోంది.
వేలం.. లేదండోయ్
అధికారులు, నిర్వహణ కమిటీ.. మూడేళ్లకోసారి భూముల వేలం చేపట్టి.. లీజుల పెంపుపై నిర్ణయించాలి. ఇక్కడా పరిస్థితి లేదు. లీజులు పెంచే అధికారుల చర్యలకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డుతగులుతున్నాయి. నాలుగేళ్ల కిందట అంతర్వేది పల్లెపాలెం దీపస్తంభం సమీపంలో, అంతర్వేది దేవస్థానంలో కొన్ని భూములను అధికారులు స్వాధీనం చేసుకుని వేలం వేశారు. ఈ మెరక భూమికి ఎకరాకు రూ.15 వేల వరకు లీజు పలికింది.
లీజూ.. చెల్లించరే
మిగిలిన భూమికీ అదేస్థాయి గిరాకీ ఉన్నా వేలం వేసే దిశగా చొరవ చూపడంలేదు. లీజు మొత్తం కూడా సక్రమంగా చెల్లించడం లేదు. బకాయిలు రూ.80 లక్షల వరకు ఉన్నాయి. అంతర్వేది, కేశవదాసుపాలెం, శృంగవరప్పాడు, గొంది గ్రామాల్లో 650 ఎకరాల వరకు భూములు ఉన్నాయి.
అక్రమాలు తేలుస్తాం
అంతర్వేది స్వామి వారి భూముల తాజా పరిస్థితిపై సర్వే నిర్వహిస్తాం. ప్రస్తుతం ఏ పంటలు సాగులో ఉన్నాయో గుర్తిస్తాం. దానికి అనుగుణంగా లీజులు పెంచుతాం. నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువుల ఏర్పాటును గత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. భూములు వేలం వేసి.. మూడేళ్లకోసారి లీజులు మార్పు చేసి ఆదాయం పెంచుతాం. - వై.భద్రాజీ, సహాయ కమిషనర్
ఇదీ చదవండి: క్వారంటైన్ కేంద్రాలు వ్యాధి తగ్గించడానికా లేక చంపడానికా?: నారా లోకేశ్