అన్నవరం సత్యదేవుని ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు వారి సమాచారం తెలియజేసేందుకు దేవస్థానం కేటాయించిన ప్రత్యేక వాట్సాప్ నెంబర్ పనిచేయక భక్తులు అయోమయంలో పడిపోయారు. కరోనా ఉన్నందున..అన్నవరంలో వ్రతాలు, కల్యాణం, ఇతర ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం లేని వారికోసం ఆయా పూజల్లో పరోక్షంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం భక్తులు ఆన్లైన్లో రుసుం చెల్లించిన తర్వాత దేవస్థానం కేటాయించిన వాట్సాప్ నంబర్ ( 9491249991)కు వారి పేర్లు, గోత్రనామాలు, చిరునామా, రుసుం చెల్లింపు వివరాలు పంపించాలని ప్రచారం చేశారు.
కొద్దిరోజులుగా ఈ నెంబర్ పనిచేయడంలేదు. దీనిపై దేవస్థానం పీఆర్వో కొండలరావును వివరణ కోరగా.. ఈ నెంబర్ నుంచి వేలాదిమందికి సమాచారం పంపించగా నెంబర్ బ్లాకైందని తెలిపారు.
ఆ నెంబరును పునరుద్ధరించాలని కంపెనీకి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఒకటి, రెండ్రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని..ప్రత్యామ్నయంపై కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి. నేడు ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ