Andhra Pradesh Government Employees Association : ఆర్థిక ప్రయోజనాలు, దీర్ఘకాల డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యమబాట పట్టనుంది. రెండు దశల్లో ఆందోళనలు, రిలే దీక్షలు, నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు, అనంతరం నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రాజమహేంద్రవరంలో కార్యాచరణ ప్రకటించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చి... మే 5వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆందోళన కార్యాచరణ నోటీసు జారీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కారరావుతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. మే 22 తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలలో నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామని జూన్ నెలలో అంబేద్కర్, గాంధీ విగ్రహాల వద్ద విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పారు. జులై 5, 6న నంద్యాల, కర్నూలు జిల్లాలతో ప్రారంభించి అక్టోబరు నెలాఖరు వరకు జిల్లా కేంద్రాల్లో బహిరంగ ప్రదర్శనలు చేపడతామని చెప్పారు.
నవంబర్ 1నుంచి నిరవధిక సమ్మె... అక్టోబరు 31న ఛలో విజయవాడ బహిరంగ సభ నిర్వహించి, నవంబర్ 1 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తవుతామని కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్ని అర్థం చేసుకొని సహకరిస్తే ఉద్యోగుల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న తీరు తీవ్ర అభ్యంతరమన్న సూర్యనారాయణ... ఉద్యోగుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు.
శాఖల వారీగా డిమాండ్లను జతపరిచి.. మా ఆందోళనకు సంబంధించిన కార్యాచరణ నోటీసును మే 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞాపన పత్రాన్ని అందిస్తాం. అక్టోబర్ 31న చలో విజయవాడ బహిరంగ సభ, నవంబర్ 1 నుంచి ఏరోజైనా సరే.. నిరవధిక సమ్మె చేపడతాం. మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులు, ఉద్యోస సంఘాల నాయకుల పట్ల ఉపయోగించిన భాష పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాన్ని పిలవకపోవడంపై మంత్రి మాట్లాడుతూ చట్టబద్ధమైన గుర్తింపు అని చెప్పారు. కానీ, చట్ట ప్రకారం గుర్తింపు ఉన్న సంఘాలు ఏమిటో బహిరంగ చర్చకు రావాలని మంత్రిని డిమాండ్ చేస్తున్నా. మంత్రి ఇలాగే మాట్లాడితే ఉద్యోగుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాం. - సూర్యనారాయణ, ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :