తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు వసూలయితే... రూ.69లక్షలు మాత్రమే ఇచ్చినట్లు నల్లిమిల్లి ఆరోపించారు. అయితే వాటిని ఆధారాలతో రుజువు చేయాలని సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన విరాళాల ప్రతులను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ నెల 23న మధ్యాహ్నం 2:30 గంటలకు బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో తనపై వచ్చిన ఆరోపణలపై సత్యప్రమాణం చేస్తానని.. ప్రమాణానికి హాజరు కావాలని రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు.
సవాల్‌కు ప్రతి సవాల్
ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేయడానికి తానూ సిద్ధమన్నారు. సూర్యనారాయణ రెడ్డి అవినీతిని బయటపెడితే సూటిగా స్పందించకుండా సత్య ప్రమాణం చేస్తాననటం హాస్యాస్పదమన్నారు. సత్య ప్రమాణంతో పాటు అక్కడే బహిరంగ చర్చకు సిద్ధం కావాలన్నారు. తాను చేసిన ఆరోపణలపై ప్రజల సమక్షంలో సమాధానం చెప్పాలని.. లేనిపక్షంలో రాజీనామాకు సిద్ధం కావాలని సూర్యనారాయణరెడ్డికి ప్రతి సవాల్ విసిరారు.
ఇదీచదవండి