తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ లక్మీ నరసింహుడు కొలువైన దివ్యక్షేత్రం. కొండ దిగువునే ఉంటుంది సీతారామ భార్గవ పిల్లల ఆసుపత్రి. బిడ్డల్ని ఎత్తుకొన్న తల్లులతో నిత్యం ఆ ఆసుపత్రి రద్దీగా ఉంటుంది. లోపలికి అడుగు పెడితే సేవలు అందిస్తున్న వైద్యుడ్ని చూసి ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. పండు వృద్ధుడైన వైద్యుడు చిన్నారులకు వైద్య సేవలు అందిస్తుంటారు. ఆయనే పెద్దింటి సీతారామభార్గవ. వయస్సు 93 ఏళ్లు. ఆయుర్వేదంలో డిప్లొమో చేసిన భార్గవ... తల్లీ బిడ్డల పేరిట 1948 నుంచే ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఈయన తండ్రి కేశవాచార్యులదీ వైద్య వృత్తే. భార్గవ మొదట్లో ఉపాధ్యాయుడిగా పని చేసినా ఆ తర్వాత వైద్యుడిగా స్థిర పడ్డారు. ఆ రోజుల్లో నిత్యం 25 కిలో మీటర్లు సైకిల్ పై తిరుగుతూ.... పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించే వారు. 1953లో గోదావరి వరదలొచ్చి కోరుకొండ చుట్టుపక్కల ప్రాంతాన్నీ నీటమునిగాయి. కొన్ని గ్రామాల్లో కలరా వ్యాపించింది. ఆ సమయంలో వ్యాధిగ్రస్తులకు రాత్రింబవళ్లు అందించిన సేవలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి.ఆసుపత్రులు అంతంత మాత్రంగా ఉన్న ఆ రోజుల్లో సంచార వైద్య శాలలు ఏర్పాటు చేసి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఈయన సేవలు అందించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు సీతారామ భార్గవ సేవలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి.
చుట్టూపక్క గ్రామాల ప్రజలకు నమ్మకం
కోరుకొండ పిల్లల ఆసుపత్రికి తూర్పు గోదావరితోపాటు పశ్చిమ గోదావరి, ఖమ్మం, విశాఖ వంటి సుమారు 70 గ్రామాల ప్రజలు నిత్యం జనం తరలి వస్తుంటారు. బిడ్డలపై డాక్టర్ భార్గవ చేయి పడాలని తల్లులకు సెంటిమెంట్. ఈయన హస్తవాసి అంటే ఈ ప్రాంత ప్రజలకు అంతటి విశ్వాసం. పిల్లల ఆసుపత్రిలో కేవలం ఔషధాలకు మాత్రమే డబ్బులు తీసుకోవడం విశేషం.
వైద్య సేవలోనే నాలుగు తరాలు
సీతారామ భార్గవ కుటుంబంలో నాలుగో తరం కూడా వైద్యులుగానే స్థిరపడ్డారు. కూమారుడు నలభై ఏళ్లుగా ఇదే ప్రాంగణంలో వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మనమడు కూడా వైద్యుడిగా ఇక్కడే స్థిరపడ్డారు. ఊపిరి ఉన్నంత వరకు వైద్య సేవలు అందింస్తానంటున్న ఈ శిశు ప్రాణదాత వైద్యుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.