ఎన్నికల కమిషనర్ చెప్పారని అధికారులు భయపడక్కర్లేదని.. ఏకగ్రీవంగా గెలిచిన చోట అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వచ్చని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ కారణం వల్ల వాటిని నిలిపివేయాలని చెప్పారో తెలియదని, వాటిని ఆపాల్సిన అవసరం ఉందనుకోవడం లేదని వెల్లడించారు. శనివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా ఏకగ్రీవమైన వాటిని రద్దు చేసే అధికారం ఏ ఎన్నికల కమిషన్‌కూ ఉండదన్నారు. కుప్పం నియోజకవర్గంలో పోలీసులు చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, తమ కార్యకర్తలు ఫిర్యాదు ఇచ్చినా తీసుకోవడం లేదని సుబ్బారెడ్డి ఆరోపించారు.
కుట్రపూరితంగా చేస్తున్నారు: నారాయణస్వామి
చంద్రబాబు చెప్పినవే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. చంద్రబాబుకు కృతజ్ఞతతోనే ఆయన కుట్రపూరితంగా ఏకగ్రీవాలను రద్దు చేస్తామంటున్నారని ఆరోపించారు. ఏకగ్రీవమైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయా లేదా చెప్పాలని ప్రశ్నించారు.
ఇంటి వద్దే ఉండాలనడం సరికాదు: అనిల్
ప్రజల ద్వారా ఎన్నికైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటి వద్దనే ఉండాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించడం మంచి పద్ధతి కాదని మంత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో వైకాపా మద్దతుదారులకు ఏకగ్రీవాలవుతుండటాన్ని జీర్ణించుకోలేక రమేశ్‌కుమార్ ఇలాంటి ఆదేశాలిచ్చారని విమర్శించారు. ఏకగ్రీవాలను ముఖ్యమంత్రి జగనే కొత్తగా తీసుకొచ్చినట్లు వారు మాట్లాడటం పద్ధతి కాదన్నారు.
ఉల్లంఘనపై త్వరలో విచారణ: కాకాణి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై త్వరలో విచారణ ప్రారంభిస్తామని రాష్ట్ర సభాహక్కుల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాళెంలో శనివారం వైకాపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అధికారం కోల్పోయాక అవినీతి మరకలు మాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ