పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పిస్తున్నా.. కరోనా సోకిన వారిని దూరంగా పెడుతున్నారు. కరోనా వ్యాధి బారిన పడి కాలం కలిసిరాక ప్రాణాలు కోల్పోతే అంతిమ సంస్కారాల సంగతి ఎలా ఉన్నా....రక్తం పంచుకుపుట్టిన వారైనా కడసారి కూడా చూడకుండా మొహం చాటేస్తున్నారు. దీంతో అంతిమ సంస్కారాలు ఆలస్యమవుతూ... కరోనాకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల శవాగారాలు మృతదేహాలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన యువకులు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కరోనా జేఏసీ పేరుతో ఓ కమిటీగా ఏర్పడ్డారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయి అంతిమ సంస్కారాలకు అయిన వారు ముందుకు రాక మార్చురీల్లో నిల్చిపోతున్న మృతదేహాలకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తిరుపతి, మదనపల్లె, కురబలకోటకు చెందిన సామాజిక కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలకు కొవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రికి రాయలసీమ జిల్లాల నుంచి చికిత్స కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఇటీవల పెరిగింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి చికిత్స కోసం వచ్చిన మైనార్టీవర్గ ప్రజలు ప్రాణాలు కోల్పోగా వారి బంధువులు మృతదేహాలను వదిలేసి వెళ్తున్నారు. ప్రభుత్వం తిరుపతి నగరంలోని గోవింధధామ శ్మశానవాటికలో దహన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే కొంతమంది ముస్లింలు కొవిడ్ జేఏసీగా ఏర్పాటి వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
తొలుత....కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తిరుపతి నగర వాసుల అంత్యక్రియలకు పరిమితమైన యువకులు....తమ సేవలను ఇతర జిల్లాలకు విస్తరించారు. ఆయా ప్రాంత వాసులు అంగీకరిస్తే వారి సొంత గ్రామాలకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వీలుకాని పరిస్థితుల్లో తిరుపతిలోనే పూర్తిచేస్తున్నారు. ఆసుపత్రి నుంచి శ్మశానవాటికకు తరలించడానికి అంబులెన్స్‌లు ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తుండటంతో ఓ చిన్నపాటి వాహనాన్ని కొనుగోలు చేసి మృతదేహాలను తరలించడానికి సరిపోయేలా తయారు చేశారు.
ఇదీ చదవండి:
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్ సమీక్ష