చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపుల పల్లి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ (19) శుక్రవారం ఐరాల మండలం తోటపల్లి వద్ద వాగు దాటుతూ గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది శనివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు.
నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో యువకుని ఆచూకి తెలియరాలేదు. కిరణ్ కుమార్ ప్రస్తుతం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి. సంఘటనా స్థలానికి చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
సురక్షితంగా ఒడ్డుకు చేరిన అబ్బులయ్య..
కొట్రకోన సమీపంలోని నీవా నదిలో చిక్కుకున్న వృద్ధున్ని చిత్తూరు పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గంగాధర నెల్లూరు మండలం కలిజవేడుకు చెందిన అబ్బులయ్య నీవా నదిలో చిక్కుకుపోయారు. నదికి ఇవతలి వైపున ఉన్న పొలానికి కుమారుడితో వెళ్లి...ఇంటికి తిరిగి వస్తుండగా నీవానదిలో చిక్కుకుపోయాడు.
ఎన్టీఆర్ జలాశయం నుంచి నీటిని కిందకు వదలడంతో నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. వరద నీరు పెరగడంతో అబ్బులయ్య కుమారుడు వేగంగా నది అవతలి ఒడ్డుకు చేరుకొని తండ్రి నీటిలో చిక్కుకుపోయిన సమాచారాన్ని పోలీసులకు తెలియచేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఎన్టీఆర్ జలాశయం గేట్లను మూసివేసి నీటి ప్రవాహం తగ్గిన తర్వాత తాడువేసి అబ్బులయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
నారాయణ వనం మండలంలోని తుంబూరు వద్ద అరుణానదిపై నిర్మించిన వంతెన... వరద ఉద్ధృతికి దెబ్బతింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉండడంతో... ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: