చిత్తూరు జిల్లా పాకాల ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ వాలంటీర్లు ధర్నా చేపట్టారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారంటూ నిరసన తెలిపారు.
జగనన్న కాలనీల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆరోపించారు. పాకాల పంచాయతీలోని రెండు గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు గురువారం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో తహసీల్దారు భాగ్యలక్ష్మిని కలిశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి కుసుమకుమారి తమపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపిస్తూ.. మూకుమ్మడిగా రాజీనామా పత్రాల్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వాలంటీర్లకు తహసీల్దార్ హామీ ఇచ్చారు.
అయితే దీనిపై పంచాయతీ కార్యదర్శి మరో వాదన వినిపిస్తున్నారు. ‘గతవారం పంటపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. వాలంటీర్లు విధిగా ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంపీడీవో అన్ని పంచాయతీ కార్యాలయాలకూ తాఖీదులు పంపారు. బయోమెట్రిక్ నమోదు చేయాల్సి వస్తుందనే కారణంతోనే వాలంటీర్లు రాజీనామా చేస్తామంటున్నారు’ అని పంచాయతీ కార్యదర్శి కుసుమ కుమారి చెబుతున్నారు.
ఇదీ చదవండి: RED SANDAL: శేషాచల అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..22 దుంగలు స్వాధీనం