కరోనా ప్రభావంతో దాదాపు 10 నెలలపాటు యాత్రికులు లేక నిర్మానుష్యంగా మారిన శేషాచలంలోని దర్శనీయ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. లాక్డౌన్ వల్ల గతేడాది మార్చి 20 నుంచి తిరుగిరుల్లో ఉన్న యాత్రా స్థలాలను తితిదే మూసివేసింది. కొవిడ్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు రావడం వల్ల శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు.. ఇతర దర్శనీయ ప్రాంతాలనూ చూసే భాగ్యం కల్పించింది.
పాపవినాశనం మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయం, జపాలీతీర్థం, ఆకాశగంగ, గంగమ్మ ఆలయంతో పాటు శ్రీవారి పాదాల మార్గంలోని శిలాతోరణం, చక్రతీర్థం ...సందర్శకులతో కళకళలాడుతున్నాయి. కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన భక్తులు శ్రీనివాసుని దర్శనంతో పాటు ఇతర తీర్థాలనూ దర్శించుకుంటున్నారు.
శేషాచల అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తూ ప్రకృతి సౌందర్యాల వీక్షిస్తూ సేదతీరుతున్నారు. జలపాతాలు...సెలయేర్ల సవ్వడులు...పక్షుల కిలకిలరావాలు...పచ్చని చెట్ల మధ్య కుటుంబ సభ్యులతో కొత్త మధురానుభూతులు పొందుతున్నారు.
తీర్థాలకు భక్తులను అనుమతిస్తూ తితిదే తీసుకున్న నిర్ణయంతో...తమకు మళ్లీ ఉపాధి దొరికిందని ట్యాక్సీ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో యాత్రికుల సందడి తగ్గిన తిరుమలలో క్రమంగా సాధారణ స్థితి వస్తోందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి.