చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పండించిన పంటకు ధరలేక ఇప్పటికే రైతులు పంటను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. అయినా గుజ్జు పరిశ్రమల యజమానుల్లో మార్పు రావడం లేదు. రెండు రోజుల క్రితం వరకు తోతాపురి మామిడి కాయలు టన్ను రూ.8 వేలు పలికింది. శనివారం పుత్తూరు, బంగారు పాళ్యం మార్కెట్ యార్డుల్లో టన్ను రూ.6 వేలు పలకడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
టన్ను రూ.9 వేలకు తగ్గకుండా చూడాల్సిందే..
జిల్లా కలెక్టర్ పలుమార్లు గుజ్జుపరిశ్రమలు, రైతులతో సమావేశాలు నిర్వహించి టన్ను రూ.9 వేలకు తగ్గకుండా చూడాలని ఆదేశించారు. రైతులు కోరినట్లు టన్నుకు రూ.13వేలు కాకపోయినా రూ.11 వేలు ఇవ్వాలన్నారు. అందుకు అంగీకరించిన గుజ్జు పరిశ్రమల యజమానులు 24 గంటలు గడవక ముందే మాట మార్చారు.
అన్నదాతల ఆందోళన..
మామిడి ధరలు మరింత క్షీణిస్తుండటంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తూర్పు మండలాల్లో ఇప్పటికే 60 శాతానికిపైగా కోతలు పూర్తి కావొచ్చాయి. మరో 15 రోజుల్లో మొత్తం పంట అయిపోతుంది. బంగారు పాళ్యం ఏరియాలో మరో నెల రోజుల పాటు మామిడి పంట మార్కెట్‌కు వస్తుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని నూజివీడులో సీజన్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇప్పటికే జిల్లాలోని మామిడికి ఆశించిన ధరలు రావాలి.
వాళ్లు సిండికేట్‌గా మారారు..
అయితే గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా మారి రైతుల కష్టాన్ని దోచేస్తున్నారు. రోజురోజుకు తోతాపురి ధరలు తగ్గుతుండటంపై దిగాలు చెందుతున్నారు. తోటల్లో యాజమాన్యం పద్ధతులు, సస్యరక్షణ, కోతలు, రవాణాతో కలిపి ఎకరాకు రూ. 30వేల వరకు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఆశించిన దిగుబడులు లేకపోవడంతో ఎకరాకు రెండు, మూడు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నష్టాలు తప్పవని వాపోతున్నారు.
ఫలరాజు పరిస్థితి అంతంతమాత్రమే..
ఫలరాజుగా పేరొందిన బేనీషా రకం మామిడి ధరలు కూడా రోజురోజుకు పతనం అవుతున్నాయి. టన్ను రూ.8వేల నుంచి రూ.16వేల వరకు ఉంది. గతంలో టన్ను రూ.22వేల వరకు పలికింది. బేనీషా రకం కూడా టన్నుకు రూ.6వేలకు పడిపోయింది. రుమాని, నీలం వంటి రకాల ధరలు సైతం తగ్గిపోయాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : Prakash raj: 'మా' అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్‌రాజ్