కరోనా వైరస్ ప్రభావం చిత్తూరు జిల్లా టమాటా రైతులపై తీవ్రంగా పడింది. సీజన్ ప్రారంభం కావటం, దిగుబడి ఆశించిన స్థాయిలో రావటంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు మిగల్లేదు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించటంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. నెల రోజులుగా టమాటా పంటను విక్రయించటానికి తంటాలు పడుతున్నారు రైతులు.
చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన మదనపల్లి, తంబళ్లపల్లె కురబలకోట, బీ.కొత్తకోట, పెద్దతిప్ప, సముద్రం, రామసముద్రం, పుంగనూరు, వాల్మీకిపురం, కలికిరి, గుర్రంకొండ తదితర మండలాల్లో రైతులు ఈ సీజన్లో టమాటా సాగుపైనే ఆధారపడతారు. దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా... విక్రయించటం కష్టంగా మారుతోంది. మదనపల్లి మార్కెట్ యార్డుకి 1500 మెట్రిక్ టన్నుల టమాటాలు వస్తుంటాయి. ప్రస్తుతం 150 మెట్రిక్ టన్నులే వస్తున్నా... కొనే వారు లేరు. ధర రాకపోయినా అమ్ముకోలేని దుస్థితి.
పెట్టిన పెట్టుబడి రావటం లేదనీ, పంట అమ్మినా కూలీలకు చెల్లించేందుకు చేతి నుంచే ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మెుత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి: ఎంపీ మిథున్ రెడ్డి