ఆసియాలో అతిపెద్ద జంతుప్రదర్శనశాలగా ప్రత్యేక గుర్తింపు పొందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు నిధుల కొరత ఏర్పడింది. కరోనాకు ముందు... సందర్శకుల ప్రవేశ రుసుముతో పాటు క్యాంటీన్ల నిర్వహణ, లయన్ సఫారీ వంటి వాటితో ఏటా ఆరు కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. ప్రస్తుతం కొవిడ్ అన్‌లాక్ తర్వాత సందర్శకులను అనుమతిస్తున్నప్పటికీ... ఆదాయం అంతంతమాత్రంగానే వస్తోంది.
ఏడాదికి ఐదున్నర కోట్ల వ్యయం...
జంతు ప్రదర్శనశాలలో ఉన్న జంతువులకు ఆహారం అందించడం కోసం.. ఏడాదికి రెండున్నర కోట్లు, సిబ్బంది జీత భత్యాలకు మూడున్నరకోట్ల రూపాయలు చొప్పున వ్యయం చేయాల్సి వస్తోంది. స్థానికంగా వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వం కేటాయించే నిధులతో జంతు ప్రదర్శనశాల నిర్వహణ సాఫీగా సాగేది. కానీ ప్రస్తుతం సందర్శకులు లేక ఆదాయం కోల్పోయి.. జూ నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది.
ప్రత్యామ్నాయాల వైపు అధికారుల దృష్టి...
కరోనా ప్రభావంతో జంతుప్రదర్శనశాల ఆదాయంలో కోల్పోతుండటంతో... ప్రత్యామ్నాయాల వైపు అధికారులు దృష్టి సారించారు. జంతువులను దత్తత ఇవ్వడం, బహుళజాతి కంపెనీల సీఎస్‌ఆర్ నిధులతో విరాళాలు సేకరిస్తున్నారు. ముప్పై నుంచి నలభై శాతానికి మించి సందర్శకులు రాకపోవడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇదీ చదవండి:
జేబులు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు... అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు