ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి క్షేత్రంలో.. లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక.. రాజకీయ వేడిని పుట్టిస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే తమ గెలుపు నల్లేరుపై నడకేనని అధికార వైకాపా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాల ఫలితాలను మార్చేస్తోందని ప్రతిపక్షాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ విమర్శనాస్త్రాలతో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఏడు నియోజకవర్గాలను చుట్టేసిన లోకేశ్...
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాలను చుట్టేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమదైన శైలి విమర్శలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరో వైపు భాజపా కూడా ప్రచార వేగాన్ని పెంచింది. ఇప్పటికే తమ మిత్రపక్షనేత పవన్‌కల్యాణ్ తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించి... తమ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. అన్ని పార్టీలు తమ అధినేతల ప్రచారాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ నెల 14న సీఎం జగన్ ప్రచారానికి రానుండటంతో.. ఉపఎన్నికలు మరింత వేడిని రాచుకున్నాయి. రెండేళ్లలో తిరుపతిలో అడుగుపెట్టని ముఖ్యమంత్రి... ఓటమి భయంతోనే ఉపఎన్నికల ప్రచారానికి వస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వరదలు సంభవించినప్పుడు కూడా బయటకు రాని సీఎం.. ఎన్నికలప్పుడు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంటింటికీ ఉత్తరాలు రాయడం ఓటమి భయంతోనే అంటూ విమర్శలకు పదునుపెట్టాయి.రెండేళ్ల కాలంలో తాము చేపట్టిన సంక్షేమ, అభివవృద్ధి పథకాలే తమ విజయానికి దోహదపడతాయని.... 5లక్షల మెజారిటీయే లక్ష్యమని అధికార వైకాపా చెబుతోంది. విపక్ష పార్టీల ఆరోపణలను అధికార పక్షం తనదైన రీతిలో తిప్పకొడుతోంది. ఓటమి భయంతోనే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇంటింటా తిరుగుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయంగా మార్చేస్తున్నాయి. ప్రజలు మాత్రం ఏ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: