తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు తిరుపతి శాసనసభ్యుడు కరుణాకరరెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మూడో డివిజన్ పాత తమిళ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే వెళ్లారు. శాసనసభ్యుడు పోలింగ్ కేంద్రానికి రావటంపై తెదేపా నేతల నిరసనకు దిగారు. కరుణాకరరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం పోలింగ్ కేంద్రం ఆవరణలోకి రాకుండా తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించారు.
దీంతో తెదేపా, వైకాపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధి హోదాలో పోలింగ్ సరళి పరిశీలించే అధికారం శాసనసభ్యుడికి ఉంటుందని... ఆయనను ఎలా అడ్డుకుంటారని వైకాపా నాయకులు ప్రశ్నించారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో కరణాకరరెడ్డిని పోలీసులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. కారులో నుంచి దిగకుండానే ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి రెండు బ్యాలెట్ పత్రాలు.. నిలిచిపోయిన పోలింగ్